Share News

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:04 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జనసేనాని..

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు

  • అన్ని గ్రామాలకూ ‘జల్‌ జీవన్‌’తో రక్షిత నీరు

  • విస్తృతంగా మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణం

  • సీఎం-డిప్యూటీ సీఎం భేటీలో కీలక చర్చలు

  • గ్రామీణాభివృద్ధి పనులపై ప్రధాన దృష్టి

  • తాజా రాజకీయ పరిణామాలపైనా..

  • రాజ్యసభ ఖాళీల భర్తీపై మాటామంతీ

  • నామినేటెడ్‌ నియామకాలు వేగవంతం

  • లడ్డూపై మండలిలో వైసీపీ కుయుక్తులను దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయం

అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జనసేనాని.. సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా.. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జల్‌ జీవన్‌ మిషన్‌, రాష్ట్రవ్యాప్తంగా మ్యాజిక్‌ డ్రెయిన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం-నిర్వహణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. తాజా బడ్జెట్‌లో జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.4 వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో పనుల పురోగతిపై ముఖ్యమంతితో డిప్యూటీ సీఎం చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్‌ మిషన్‌ స్కీంను పూర్తిగా పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టారు. రోజుకు ఒక్కో వ్యక్తికి 55 లీటర్ల తలసరి నీటి వినియోగ లక్ష్యాన్ని చేరేలా జల్‌ జీవన్‌ మిషన్‌కు రూపకల్పన చేశారు. దీని ద్వారా 100 శాతం గ్రామాలకు రక్షిత నీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ వివరించారు.


రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై..

సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సామాజిక సమీకరణల ఆధారంగా మూడు పార్టీల నడుమ సమతుల్యం పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక జరపాలని చంద్రబాబు, పవన్‌ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తయిందని.. ఇంకా పలు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సి ఉందని, వాటిని వేగవంతం చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపైనా నేతలు చర్చించుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోందని పవన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. బుధవారం శాసనమండలిలో ఈ అంశంపై చర్చ జరగనున్నందున.. సభలో వైసీపీ కుయక్తులను దీటుగా ఎదుర్కొనేలా కూటమి సభ్యులకు దిశానిర్దేశం చేయాలని ఉభయులూ నిర్ణయించారు.

Updated Date - Mar 04 , 2026 | 03:05 AM