వారంతా నేరస్థులే.. కల్తీ నెయ్యిపై మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:34 PM
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.
అమరావతి, ఫిబ్రవరి 3: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ ఇచ్చిన నివేదికలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నెయ్యిలో కెమికల్స్, ఇతర ఫ్లేవర్స్ కలిపారన్నారు. వైసీపీ నేతలు కల్తీని సహజం అంటున్నారని మండిపడ్డారు. తెలిసి కూడా వారు మౌనంగా ఎందుకు ఉన్నారనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీయే పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పడంతో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలిపారు. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న ఎన్‌డీటీబీ రిపోర్టు ఆధారంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.
నెయ్యి పరీక్షల్లో 'ఎస్ వాల్యూ'లో తేడా ఉందని, అంటే.. సస్పెక్టెడ్ అడల్టరేషన్ జరిగే అవకాశం ఉందన్నారు. సోయాబీన్, కోకోనట్, పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, లార్డ్ వంటి అవశేషాలు ఉండే అవకాశం ఉందని నివేదికలో వెల్లడైందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు పోస్టింగుల్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా శ్యామల రావును నియమించారని తెలిపారు. దీంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. 2022 ఆగస్టు 3న బీటా సిటోస్టెరాల్ ఉన్నట్టు రిపోర్టు వచ్చినప్పటికీ, దాన్ని కొనసాగిస్తూ తప్పును కప్పిపుచ్చారని మంత్రి ఆరోపించారు.
పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు మంత్రి పయ్యావుల. ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్లు కేటాయించారని ధ్వజమెత్తారు. ఇందులో భాగస్వాములైన అందరినీ నేరస్థులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారికి జరిగిన అపచారంలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సహా పలువురు అధికారులు ఉన్నారన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పిందన్నారు. బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్‌పై చర్యలకు సిట్ సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారని సిట్ పేర్కొందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నెయ్యి కల్తీ వ్యవహారం.. ఏపీ కేబినెట్‌లో సిట్ నివేదికపై చర్చ
సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..
Read Latest AP News And Telugu News