టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:23 PM
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదకపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
అమరావతి, ఫిబ్రవరి 3: తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ (AP Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి, అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. అప్పట్లో పర్చేస్ కమిటీకి సభ్యులు కాని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు. అయితే, ఆనాడు కమిటీ సభ్యులుగా ఉన్న తనను, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని పిలవలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్‌లో అధికారులు పేర్కొన్నారు. నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్ దక్కించుకున్నారని, టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ ఈఓగా ఉన్న సింఘాల్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా పట్టించుకోకపోవడంపై చర్చించారు. అప్పటి అధికారులు బాలాజీ, సుబ్రహ్మణ్యం దానిని పక్కన పెట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలిందని, అదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రులు తెలిపారు. సిట్ నివేదికలో కొంతమంది పేర్లు పేర్కొన్నప్పటికీ, చివరి ఫైండింగ్స్‌లో వాటిని పేర్కొనకపోవడంపై చర్చ జరిగింది. ఈ లోపాలన్నింటిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించింది.
టెండర్ ప్రక్రియలో లోపాలపై దృష్టి సారించాలని కమిటీకి మంత్రిమండలి సూచించింది. సహకార డెయిరీలను పక్కన పెట్టేందుకు పథకం రూపొందించారని కేబినెట్ పేర్కొంది. సహకార డెయిరీలను పక్కన పెట్టడం ద్వారా బోగస్ డెయిరీలను రంగంలోకి తీసుకువచ్చారని అధికారులు వివరించారు. దీనిపైనా ఎంక్వైరీ కమిటీ దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. అడ్వకేట్ జనరల్, సీనియర్ అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పాత్ర గురించి సిట్ నివేదికలో ఏమైనా పేర్కొన్నారా? అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఛార్జ్‌షీట్‌లో యానిమల్ ఫ్యాట్ ఉందని పేర్కొన్నారా? అని కూడా పవన్ అడిగారు. ఛార్జ్‌షీట్‌లోని 35వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారని పవన్‌కు చెప్పారు అధికారులు.
అసలు సూత్రధారులను వెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సిట్ నివేదికలో లోపాలు ఉన్నాయని, అసలు సూత్రధారులను బయటకు తీసుకురాలేకపోయిందని మంత్రులు పేర్కొన్నారు. అందువల్ల వెంటనే అసలు సూత్రధారులపై ఫోకస్ పెట్టాలని మంత్రులు చెప్పారు. ఈ విషయాలను బహిర్గతం చేసేందుకే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నెయ్యి కల్తీ వ్యవహారం.. ఏపీ కేబినెట్‌లో సిట్ నివేదికపై చర్చ
లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన
Read Latest AP News And Telugu News