Share News

పంట మార్పిడి అవసరం.. డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయండి: మంత్రి

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:16 AM

ఏపీ అసెంబ్లీలో వరి రైతుల కష్టాలు, సేంద్రీయ సాగు ప్రత్యామ్నాయ పంటలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి తెలిపారు.

పంట మార్పిడి అవసరం.. డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయండి: మంత్రి
Minister Atchannaidu

అమరావతి, మార్చి 4: ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా వరి రైతులకు నష్టాలు, సేంద్రీయసాగు ప్రత్యామ్నాయ పంటలపై ఎమ్మెల్యేలు నడికుడితి ఈశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. నీరు కనిపిస్తే చాలు రైతులు వరి పంట వేస్తున్నారని తెలిపారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవన్నారు.


ప్రస్తుతం వరి ద్వారా ఎకరాకు రూ.6 వేల మాత్రమే ఆదాయం వస్తుందని, అదే సమయంలో కంది ద్వారా రూ.26 వేలు, మినుములు రూ.21 వేలు, జొన్న ద్వారా రూ.16 వేల ఆదాయం సాధ్యమని వివరించారు. ప్రత్యేకంగా పామాయిల్ పంటపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగు చేస్తే ఎకరాకు రూ.1.60 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. అందుకే పామాయిల్ పంట పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.


పంట వైవిధ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, భూసారం పెంచటానికి సూక్ష్మ పోషకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆమోదించిన విత్తనాలను మాత్రమే సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, మార్కెట్ డిమాండ్ ఆధారంగా వరి రకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రాధాన్య రకాల విత్తనాలను రాయితీపై అందజేస్తున్నామని వెల్లడించారు. సాగునీటి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. పంట మార్పిడి కోసం 15 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోదావరి జిల్లాల్లో వరి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని, కానీ ఇతర ప్రాంతాల్లో పంట మార్పిడి అవసరమని సూచించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కౌలు రైతులకు కూడా రుణాలు అందేలా చర్యలు తీసుకున్నామని, మొక్కజొన్న పంట కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

రెవెన్యూ శాఖలో కోర్టు కేసులు.. పారదర్శకంగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 11:43 AM