Share News

‘భూమి ఇచ్చేందుకు సిద్ధం’.. పంచగ్రామాల సమస్యలపై మంత్రి ఆనం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:21 PM

సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామ సమస్యలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘భూమి ఇచ్చేందుకు సిద్ధం’.. పంచగ్రామాల సమస్యలపై మంత్రి ఆనం
AP Assembly

అమరావతి, మార్చి 4: సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామాల సమస్యపై విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivasrao) అసెంబ్లీలో ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. పంచగ్రామాలు ఐదు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. 1996లో అప్పల సూర్యనారాయణ ఆధ్వర్యంలో హౌస్ కమిటీ ఏర్పాటు చేశారని... ఆ తర్వాత 2000లో 578 జీఓ, 2019లో 229 జీఓలు జారీ చేశారన్నారు. పంచగ్రామాల్లో రైతుల సమస్యలతో పాటు ఇళ్లు నిర్మించుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన సభలో తెలిపారు.


ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 100 రోజుల్లో సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. 100 గజాల లోపు స్థలం ఉచితంగా ఇచ్చేలా, అంతకంటే ఎక్కువ ఉంటే డబ్బు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే చరిత్ర క్షమించదన్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు కూర్చొని తక్షణం ఈ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.


ఈ ప్రశ్నకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) సమాధానమిస్తూ... గతంలో అసెంబ్లీ హౌస్ కమిటీ, మంత్రివర్గ ఉపసంఘాలు నివేదికలిచ్చాయని తెలిపారు. వాటి ఆధారంగా జీఓలు ఇచ్చినా అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో సమగ్ర విధానం రూపొందించిందని వివరించారు. కొందరి భూములు క్రమబద్ధీకరించిన తర్వాత మళ్లీ కోర్టుకు వెళ్లడంతో సమస్య తలెత్తిందని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదాయ, రెవెన్యూ శాఖలను సమావేశపరిచి పరిష్కారం చూడాలని సీఎం సూచించారని తెలిపారు.


సర్వే పూర్తి చేసిన తర్వాత 12,410 నివాసాలు ఉన్నట్లు తేలిందని, వాటన్నింటినీ క్రమబద్ధీకరించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి వివరించారు. అంతే విలువైన భూమిని సింహాచలం ఆలయానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించగా.. సింహాచలం ట్రస్టు సమ్మతించిందని మంత్రి తెలిపారు. భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ విషయాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో అందజేశామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 12:26 PM