గుడివాడలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:16 PM
గుడివాడలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
కృష్ణా జిల్లా, మార్చి 11: గుడివాడలో భారీ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. గుడివాడలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. గుడివాడ రూరల్ మండలం టిడ్కో కాలనీ ఫ్లాట్లలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొడాలి నాని అనుచరుడు మసాలా శివతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో మసాలా శివ, భాను ప్రసాద్, కనక మహేష్, అజయ్ బాబు, వంశీ కిరణ్ ఉన్నారు. బెట్టింగ్ రాయుళ్ల వద్ద నుంచి రూ.1.05 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మసాలా బండి నుంచి... బెట్టింగ్ ద్వారా శివ కోట్లాది రూపాయలు సంపాదించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో శివకు పోలీసులు రాచ మర్యాదలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శివ ఫోన్లలో పలువురు పోలీస్ అధికారులు, వైసీపీ నేతల వ్యక్తిగత నంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కొడాలి నానికి పెద్ద ఎత్తున నగదును శివ సమకూర్చినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలోనూ శివ బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక దృష్టితో బెట్టింగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో మసాలా శివతో జట్టుకట్టి బెట్టింగ్ దందాలు నడిపినట్లు కొడాలి నాని రాజకీయ వ్యూహకర్త వినోద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వినోద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ సోమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కేసు వివరాలను వెల్లడించారు. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించి వాట్సాప్ చాటింగ్, ఫోన్ స్క్రీన్‌షాట్లను గుర్తించామని తెలిపారు. బెట్టింగ్ నిర్వాహకుడు మసాలా శివ, అతనికి సహకరిస్తున్న భాను ప్రసాద్, కనక మహేష్, అజయ్ బాబు, వంశీ కిరణ్‌ను అరెస్ట్ చేశామన్నారు. మరో 17 మంది బుకీలు, బెట్టింగ్‌లో భాగస్వామ్యులైన 92 మందిని గుర్తించామని సీఐ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం తరలించామని.. దీనిపై విచారణ కొనసాగుతోందని సీఐ సోమేశ్వరరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న
నా పార్టీకి నేనేంటో తెలుసు.. అన్నీ అబద్ధపు ప్రచారాలే: భానుప్రకాశ్ రెడ్డి
Read Latest AP News And Telugu News