నా కొడుకు బూడిద కావాలి..: గాదె సాయికృష్ణ తల్లి
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:47 PM
గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు.
విజయవాడ, జులై 4 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కేసుకు (Gade Sai Krishna case) సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త ఈరోజు (శనివారం) హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు. ఈ కేసు విచారణ సందర్భంగా.. పోలీసులపై విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే చంపేసి, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లామని విజయలక్ష్మి తెలిపారు. అయితే, అప్పటి సీఐ నాగరాజు తన కుమారుడిని చూడనీయకుండా వెనక్కి పంపించారని అన్నారు. ఈ కేసులో న్యాయం చేయాలని విచారణాధికారిని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేడుకున్నారు. ‘విచారణలో కేసు విషయాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. నా కొడుకు బూడిద నాకు కావాలి. బూడిద ఇవ్వకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని తగలబెట్టేసుకుంటా. నా కొడుకుని ఎందుకు చంపారు..? ఎవరెవరు ఉన్నారో అందరినీ శిక్షించాలి. నా కొడుకు చేతిలో మేకులు దింపి చంపారు. నలుగురైదుగురినే అరెస్టు చేశారు..? మిగిలిన వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు..? నా ఇంటికి వచ్చి నా బిడ్డని తీసుకెళ్లిన వాళ్లు ఎక్కడ..? ఇందులో ఉన్న వాళ్లెవరినీ వదిలిపెట్టొద్దు. ఇందులో ఉన్న వాళ్లందరూ నాకు తెలుసు. స్టేషన్‌లో ఉన్న బూడిద ఎవరిదో ఎవరికి తెలుసు..? నా కొడుకు దే అని గ్యారంటీ ఏంటి. నాగరాజు ఎంతమందిని చంపాడో.. ఎవరికి తెలుసు..? చివరికి నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. అసలు నా కొడుకుని ఎందుకు చంపారు..? కారణం ఏంటి..? నాకు చెప్పాలి’ అని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా మెజిస్టీరియల్ విచారణ కొనసాగింది. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర, నిష్పాక్షిక విచారణ అవసరమని సాయికృష్ణ తల్లి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు
నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News