కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టమైన విధానం ఉండాలి: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:06 PM
గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజమండ్రి, ఆగస్టు 02: గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమిలో భాగస్వామ్య పార్టీలు వేరైనా, ప్రభుత్వాల బాధ్యత రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని ఉద్ఘాటించారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోతే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోలవరం ముంపు పరిధిలోని భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించాలన్నారు. 'ఒడిశాలో భూసేకరణ కోసం అవసరమైతే 10 నుంచి 15 రెట్లు పరిహారం ఇచ్చినా నష్టం లేదు. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాను' అని వెల్లడించారు.
కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆయన.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే ఏపీ 277 టీఎంసీలు, తెలంగాణ 97 టీఎంసీల నీటిని నష్టపోతాయని హెచ్చరించారు. ఇది రెండు రాష్ట్రాలకు 'డబుల్ పంచ్' లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 'ముఖ్యమంత్రులు కలవడంలో తప్పులేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం సాధిస్తున్నారనేదే ముఖ్యం' అని అన్నారు. గతంలో తాను కృష్ణా జలాల పరిరక్షణ కోసమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌కు ఇది స్వర్ణ యుగం: కామన్వెల్త్‌లో భారత్ విజయాలపై పీటీ ఉష హర్షం
దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్