Share News

భారత్‌కు ఇది స్వర్ణ యుగం: కామన్వెల్త్‌లో భారత్ విజయాలపై పీటీ ఉష హర్షం

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:53 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నీలో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ చరిత్రాత్మక విజయంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

భారత్‌కు ఇది స్వర్ణ యుగం: కామన్వెల్త్‌లో భారత్ విజయాలపై పీటీ ఉష హర్షం
Commonwealth Games 2026

స్పోర్ట్స్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నీలో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం ప్రదర్శించారు. శనివారం జరిగిన పోటీల్లో ఏకంగా ఏడు స్వర్ణ పతకాలను (7 Gold Medals) గెలుచుకుని, కామన్వెల్త్ బాక్సింగ్ చరిత్రలోనే భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రికార్డు స్థాయి పసిడి పంటను అందించారు.


ఈ చరిత్రాత్మక విజయంపై భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీనిని 'భారతక్రీడా రంగానికి లభించిన స్వర్ణ దినం'గా ఆమె అభివర్ణించారు. 'మన బాక్సర్లు పసిడి నెగ్గి, విజయపీఠంపై జాతీయ గీతం వినబడుతున్న వేళ నా హృదయం గర్వంతో నిండిపోయింది. తక్కువ ఈవెంట్లలో పాల్గొన్నప్పటికీ.. మన అథ్లెట్లు సత్తా చాటి పతకాల పట్టికలో 10వ స్థానం నుంచి ఒక్కసారిగా 4వ స్థానానికి ఎగబాకడం అభినందనీయం' అని పేర్కొన్నారు. మొత్తం 39 పతకాలతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.


ఈ అద్భుత విజయాల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర ప్రోత్సాహం, ప్రభుత్వం మరియు ఐఓఏ అందిస్తున్న క్రీడా మౌలిక వసతులు ఎంతో కీలకమని పీటీ ఉష చెప్పారు. అంతేకాకుండా క్రీడాకారుల వెనుక అహర్నిశలు శ్రమించే కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, వైద్యులు, మానసిక నిపుణులు (Mental Trainers)తో కూడిన సహాయక బృందం కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రతిభ కలగలసి భారత క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెడుతున్నాయని ఈ ఘనత స్పష్టం చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Updated Date - Aug 02 , 2026 | 07:53 PM