ఐటీలో ఉద్యోగాల సృష్టి తగ్గుతోంది: శ్రీధర్ వెంబు
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:01 PM
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతోందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. భారత్ ఆర్థికరంగానికి ఇదే అతిపెద్ద సవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతోందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. భారత్ ఆర్థికరంగానికి ఇదే అతిపెద్ద సవాలని అన్నారు. ఐటీ రంగంలో ఒకప్పటి స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగట్లేదని అన్నారు. జోహో సహా పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించనప్పటికీ ఉద్యోగాల సృష్టి తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం ఏఐపై కంపెనీలు పెట్టే ఖర్చులు పెరుగుతున్నాయని అన్నారు. మొత్తం బడ్జెట్‌లో ఏఐ ఖర్చుల వాటా అంతకంతకూ పెరుగుతోందని కూడా చెప్పారు. దీనికి తోడు పెరుగుతున్న సర్వర్, మెమరీ ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయని చెప్పారు.
‘ఒకప్పుడు ఈ డబ్బు కొత్త ఉద్యోగాల సృష్టికి వినియోగమయ్యేది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లకు వెళుతోంది. ఈ ఖర్చుల నియంత్రణకు ప్రయత్నిస్తున్నాము. కానీ చాలా మటుకు కంట్రోల్‌లో లేదు. ఏఐతో సాఫ్ట్‌వేర్‌ను మరింత వేగంగా ఉత్పత్తి చేస్తున్నాము. కానీ అసలు గ్లోబల్ మార్కెట్‌లో ఈ అదనపు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అవసరం ఉందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఏఐ కంపెనీలు కూడా మౌలిక వసతుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టాయని, ఈ పెట్టుబడులకు తగిన రాబడిపై గ్యారెంటీ లేకపోయినా ఇదే ఒరవడి కొనసాగుతోందని అన్నారు. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న యువ జనాభాకు ఏ రంగంలో ఉపాధి దొరుకుతుందన్నది ప్రస్తుతం కొంత అస్పష్టంగా ఉందని చెప్పారు.
ఆటోమేషన్ పెరుగుతుండటంతో తయారీ రంగంలో కూడా ఉద్యోగాలు తగ్గాయని చెప్పారు. దీంతో, ఉద్యోగాల కల్పన అంశం విస్తృత ఆర్థికపరమైన సవాలుగా మారిందని అన్నారు. ఆటోమేషన్‌తో వస్తు సేవల ధరలు తగ్గుతున్నప్పటికీ వాటిని కొనుగోలు చేయగలిగేలా వ్యక్తుల సంపాదన మార్గాలను కొనసాగించడమే ఆర్థిక వ్యవస్థల ముందున్న సవాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సార్వత్రిక కనీస ఆదాయం అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. భారత్‌లో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ ఇక్కడ కూడా ఈ అంశంపై రాజకీయ పరమైన ఒత్తిడి పెరగవచ్చని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా? డబ్బులు తిరిగి పొందే మార్గాలు ఇవే
నీటిలో అపారశక్తి! 100 ఏళ్ల మిస్టరీని ఛేదించానన్న భారత సంతతి శాస్త్రవేత్త