నీటిలో అపారశక్తి! 100 ఏళ్ల మిస్టరీని ఛేదించానన్న భారత సంతతి శాస్త్రవేత్త
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:19 PM
మానవాళి ఇంధన అవసరాలు తీర్చే అపార శక్తి నీటిలో దాగి ఉందని ప్రముఖ భారత సంతతి శాస్త్రవేత్త యోగేంద్ర నారాయణ శ్రీవాత్సవ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి 100 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదించానని కూడా అంటున్నారు. మరి ఈ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: గ్లాసులోని నీటితోనే మన ఇంటికి కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చా అంటే ఎవరైనా అసాధ్యమనే చెబుతారు. శాస్త్రవేత్తలను అడిగినా దాదాపుగా ఇదే సమాధానం ఇస్తారు. అయితే, భారత సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త ఇదంతా సాధ్యమేనని అంటున్నారు. తన ప్రయోగాలు గనుక ఆశించిన ఫలితాన్ని ఇస్తే అనంతమైన ఇంధన వనరు మానవాళి సొంతం అవుతుందని అంటున్నారు. నమ్మశక్యం కాని ఈ ప్రకటన చేసిన ఆయన పేరు యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ. తన సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు సొంత ఖర్చులతో ప్రయోగాలకు కూడా ఆయన సిద్ధం అవుతున్నారు. ఆయన ప్రయోగాలు సఫలం అయితే మాత్రం 100 ఏళ్ల నాటి మిస్టరీకి తెరపడినట్టే..
ఏమిటీ మిస్టరీ..
దాదాపు వందేళ్ల క్రితం ఈ మిస్టరీ గురించి ప్రపంచానికి తెలిసింది. నీటిలోకి శక్తివంతమైన విద్యుత్ స్పార్క్ పంపినప్పుడు భారీ విస్ఫోటనం జరిగి దట్టమైన పొగమంచు లాంటి మేఘం అన్ని వైపులా వ్యాపించిన వైనాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలో కంటికి కనిపించినంత చిన్న నీటి తుంపర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. విద్యుత్ ప్రవాహం కారణంగా నీరు ఆవిరిగా మారి విస్ఫోటనం జరి ఉంటుందని మొదట శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఆవిరిగా మారే స్థాయిలో నీరు వేడెక్కకపోవడంతో అసలు ఏం జరిగిందో శాస్త్రవేత్తలకే అర్థం కాలేదు. 1980లలో ఎంఐటీలో జరిగిన మరో ప్రయోగంలో రెండు టీ స్పూన్ల ఉప్పునీటిలోకి విద్యుత్ స్పార్క్ ప్రవహించేలా చేశారు. ఈ క్రమంలో మళ్లీ విస్ఫోటనం జరిగింది. దాదాపు గంటకు 3,600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన నీటి తుంపర్లు సమీపంలోని అల్యూమినియం పలకను ఛేదించాయి. అయితే నీరు మాత్రం ఎప్పటిలాగే చల్లగానే ఉండటంతో శాస్త్రవేత్తలకు మతిపోయినంత పనైంది. నీటిలోకి పంపిన విద్యుత్ శక్తికి, విస్ఫోటనం నుంచి వెలువడ్డ శక్తికి అసలు ఏమాత్రం పొంతన కుదర లేదు. అల్యూమినియం ప్లేట్‌కు చిల్లు పెట్టేంత వేగంగా తుంపర్లు ఎగసి పడే స్థాయిలో అదనపు శక్తి ఎక్కడి నుంచి విడుదలైందో వారికి అంతుపట్టలేదు.

2000లో శాస్త్రవేత్తలు పీటర్, నీల్ గ్రేనో చేసిన ప్రయోగాల్లో మళ్లీ ఇదే ఫలితం వచ్చింది. విస్ఫోటనం ద్వారా వెలువడిన శక్తి కంటే విద్యుత్ ద్వారా నీటికి అందించిన శక్తి తక్కువగా ఉన్నట్టు ప్రయోగాల్లో తేలింది. భౌతిక శాస్త్ర మూల సిద్ధాంతాల్లో ఒకటైన శక్తి నిత్యత్వ నియమానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టు అనిపించే ఫలితం ఇది. విశ్వంలోని కొత్త శక్తిని సృష్టించడం, లేదా నాశనం చేయడం సాధ్యం కాదు. మరి ఈ ప్రయోగంలో అదనపు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందనేది శాస్త్రవేత్తలకు అంతుపట్టలేదు.
అయితే, నీటిలోనే ఈ అదనపు శక్తి దాగి ఉందని శ్రీవాత్సవ చెబుతున్నారు. ఆయన తెలిపిన దాని ప్రకారం, నీటి అణువులను కలిపి ఉంచే హైడ్రోజన్ బంధాలు లాగి ఉంచిన రబ్బరు బ్యాండ్లలా తమలో శక్తిని నిల్వ ఉంచుతాయి. ఒక్కసారిగా విద్యుత్ స్పార్క్ తగిలినప్పుడు ఆ బంధాలు తెగిపడి, వాటిలో దాగి ఉన్న శక్తి విడుదలవుతుంది. దీన్ని రుజువు చేసే సిద్ధాంతం తన వద్ద ఉందని శ్రీవాత్సవ తెలిపారు. ఈ సూత్రం ఆధారంగా రూపొందించిన అంచనాలు పాత ప్రయోగాల్లో నమోదైన ఫలితాలతో సరిపోలాయని కూడా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతం నిజమైతే బొగ్గు, చమురు, యురేనియంపై ఆధారపడకుండా సాధారణ నీటితోనే కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడుతుంది. దీంతో, మానవాళికి అనంతమైన ఇంధన వనరు లభించినట్టవుతుంది.
అయితే ప్రపంచంలోని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దీనిని ఇప్పటికీ అంగీకరించడం లేదు. పాత ప్రయోగాల్లో కొలతల్లో పొరపాట్లు జరిగి ఉండటంతో నీటి నుంచి అదనపు శక్తి విడుదలైందన్న భావన కలిగిందని వారు వాదిస్తున్నారు. ఇక శ్రీవాత్సవ ప్రతిపాదిస్తున్న ఈ సిద్ధాంతం ఇంకా శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితం కాలేదు. కాబట్టి, నిపుణులు స్వతంత్రంగా ఈ సిద్ధంతాన్ని ధ్రువీకరించే అవకాశం లేదు.
అయితే, తన సిద్ధాంతంలోని పూర్తి వివరాలను శ్రీవాత్సవ ఇప్పుడే వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ఆయుధాలుగా మార్చే ప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు. ముందుగా సొంతంగా కొన్ని ప్రయోగాలు నిర్వహించి, అవి విజయవంతమైతే పూర్తి వివరాలను వెల్లడించాలని భావిస్తున్నారు.

ఎవరీ శ్రీవాత్సవ
గోరఖ్‌పూర్‌లో (యూపీ) జన్మించిన ఆయన చిన్న వయసులోనే పీహెచ్‌డీ పూర్తి చేసి, అమెరికా, ఇటలీల్లో ప్రొఫెసర్‌గా సేవలందించారు. 500కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. నోబెల్ బహుమతి నామినేషన్ల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే బృందంలో సభ్యుడిగా శ్రీవాత్సవకు రాయల్ స్వీడిష్ అకాడమీ మూడుసార్లు అవకాశం ఇచ్చిందంటే శాస్త్ర ప్రపంచంలో ఆయన పేరు ప్రఖ్యాతులు ఎంతటివో అర్థం చేసుకోవచ్చు. దీంతో, నీటి రహస్యాన్ని తాను ఛేదించానని ఆయన ప్రకటించడం ప్రస్తుతం శాస్త్రప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు చైనా సవాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఏఐ మోడల్ ఆవిష్కరణ
మీ వాట్సాప్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి