Share News

మీ వాట్సాప్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి

ABN , Publish Date - Jul 18 , 2026 | 03:41 PM

వాట్సాప్ అకౌంట్ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

మీ వాట్సాప్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి
WhatApp Security

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో వాట్సాప్ అకౌంట్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, చాలా మందికి వాట్సాప్ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉండదనే చెప్పాలి. ఇలాంటి వారు సైబర్ నేరగాళ్ల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఇటీవల ఒక శివసేన నేత వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల బారిన పడిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు ఈ అకౌంట్ ద్వారా ఆమెకు తెలిసిన వారికి మెసేజీలు పంపించి డబ్బులు కూడా కోరారు. ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

పాస్‌కీలతో మరింత భద్రత..

వాట్సాప్‌ అకౌంట్‌ను భద్రపరుచుకునేందుకు పా‌స్‌కీలకు మించినది లేదు. యూజర్ల ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్‌లను పాస్‌కీలుగా వాడతారు. ఇవి యూజర్ల డివైజులకు అనుసంధానం అయి ఉంటాయి. పొరపాటున హ్యాకర్లకు వాట్సాప్ అకౌంట్ సమాచారం ఇచ్చినా పాస్‌కీ లేకుండా అకౌంట్‌ను యాక్సెస్ చేయడం వారికి సాధ్యం కాదు. యూజర్ల డివైజ్ లేకుండా పాస్‌కీని వినియోగించడం సాధ్యం కాదు కాబట్టి సైబర్ నేరగాళ్ల పాచికలు పారవని నిపుణులు చెబుతున్నారు. పాస్‌వర్డ్‌లు, వన్ టైమ్ కోడ్స్‌తో ఉండే కొద్ది పాటి రిస్క్‌ కూడా పాస్‌కీలతో ఉండదని చెబుతున్నారు.


ఈమెయిల్ వెరిఫికేషన్

సిమ్ కార్డు పోయినప్పుడు, లేదా ఫోన్ నెంబర్ మారినప్పుడు, సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఎస్‌ఎమ్ఎస్ కోడ్స్ అందుబాటులో లేనప్పుడు వాట్సాప్ అకౌంట్‌‌ను కోల్పోకుండా ఉండేందుకు ఈమెయిల్ వెరిఫికేషన్ అక్కరకు వస్తుంది. ఇందుకోసం యూజర్లు తమ రికవరీ ఈమెయిల్‌ను వాట్సాప్‌ అకౌంట్‌లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఒక పాస్‌వర్డ్‌‌ను కూడా ఎంచుకోవాలి. దీంతో, వాట్సాప్ అకౌంట్‌ను ఏ సమయంలోనైనా యాక్సెస్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉంటుంది.

టూ స్టెప్ వెరిఫికేషన్

వాట్సాప్‌ అకౌంట్ భద్రతను మరింత పెంచేందుకు టూ స్టెప్ ఆథెంటికేషన్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా యూజర్లు వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు సాధారణ ఎస్ఎమ్ఎస్ కోడ్‌తో పాటు డివైజ్ పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ హ్యాకర్ల చేతికి ఎస్ఎమ్ఎస్ వెరిఫికేషన్ కోడ్ చిక్కినా కూడా పిన్ నెంబర్ దొరకదు కాబట్టి అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది. అయితే, ఎవరూ గెస్ చేయలేని సంఖ్యను పిన్ నెంబర్‌గా ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజులకు సంబంధించిన తేదీలను మాత్రం అస్సలు ఎంచుకోవద్దని చెబుతున్నారు.


ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్‌తో అకౌంట్ లాక్

లాగిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన పని పూర్తయినట్టు కాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇతరులకు మన డివైజ్ చిక్కినప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అకౌంట్‌ను లాక్ చేసిపెట్టుకోవాలని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలను తూచా తప్పకుండా అమలు చేస్తే యూజర్లకు సైబర్ నేరగాళ్ల నుంచి పూర్తి భద్రత లభిస్తుందని నిపుణులు హామీ ఇస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం

ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

Updated Date - Jul 18 , 2026 | 04:57 PM