హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:05 PM
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల రెండో రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల రెండో రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస తెలంగాణ వాసుల సౌకర్యార్థం హైదరాబాద్‌లో ₹20 కోట్ల అంచనా వ్యయంతో 'ఎన్‌ఆర్‌ఐ భవన్' నిర్మిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేదికగా హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు ప్రతీ వారం కనీసం 2 రోజులు తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి కేటాయించాలని కోరారు. దీనివల్ల పర్యాటకం పెరిగి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న స్థానిక కళాకారులకు చేతినిండా పని దొరుకుతుందని పిలుపునిచ్చారు. తెలంగాణ డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఆటా వేడుకల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఎన్నారై కాంగ్రెస్ బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు.

ఆటా పూర్వ అధ్యక్షులతో పాటు అమెరికాలోని ఇతర తెలుగు సంఘాల నాయకులను వేదికపై ఆటా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. భారత్, అమెరికా సైన్యంలో సేవలు అందించిన తెలుగు వీరులను గుర్తించి, వారి త్యాగాలను కొనియాడుతూ ప్రత్యేకంగా పురస్కారాలు అందజేశారు. ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ నేతృత్వంలో జరిగిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. పట్టుపురుగులను చంపకుండా తీసే ‘అహింసా సిల్క్’ తో తెలంగాణ చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా గడిచిన 10 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేస్తున్న అర్చనా కొచ్చర్, తెలంగాణ చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సభను నవ్వుల్లో ముంచెత్తారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, చలనచిత్ర రంగానికి చెందిన నటీనటులు హాజరయ్యారు. కథానాయిక పూజా హెగ్డే, హీరో అడివి శేష్ పాల్గొని ఆటా సభ్యులకు, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రెండో రోజు ఉదయం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాలు, పోతరాజుల విన్యాసాలు, జానపద రూపాన్ని ప్రతిబింబించే మత్స్యకారుల నృత్య ప్రదర్శనలతో ప్రారంభోత్సవ వేడుక అలరించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా శివలింగాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలతో ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రముఖ గేయ రచయిత జోన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేకంగా రచించిన గేయానికి అందించిన నృత్య రూపకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 7 వేర్వేరు డాన్స్ స్కూళ్ల నుంచి వచ్చిన 180 మంది నాట్య కళాకారులు ఏకధాటిగా ప్రదర్శించిన ఈ అద్భుత దృశ్యకావ్యం సభను మైమరిపించింది. ఈ విశిష్ట ప్రదర్శన కోసం కళాకారులు గత 4 నెలలుగా కఠోర సాధన చేశారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ఆటా కమిటీకి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజానికి, తెలుగు భాషా సంస్కృతులకు ఆటా అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. పలువురు దాతలను నిర్వాహకులు వేదికపై ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వ్యాపార స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీనివాస్ సజ్జా, మురళి గింజుపల్లిల మార్గదర్శకత్వంలో సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ (St. Martinus University) ప్రతినిధులు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. అమెరికాలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఉన్న అవకాశాలు, కోర్సులు, మార్గాల గురించి సందర్శకులకు సమగ్రమైన అవగాహన అందించారు. సమాజానికి అందిస్తున్న సేవలను, తెలుగు సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తిస్తూ మేరీల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసి ఆటాను గౌరవించింది.









ఈ వార్తలనూ చదవండి:
సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం
బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమైన ఆటా వేడుకలు