ఎంపీ పప్పు యాదవ్‌పై హత్యాయత్నం?.. ఢిల్లీ పోలీసుల అదుపులో నిందితుడు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:53 PM
బిహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఇవాళ (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు.
న్యూఢిల్లీ: బిహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఇవాళ (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అక్కడంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పట్టుకున్న ఎంపీ అనుచరులు పోలీసులకు అప్పగించారు. ఇటీవల పార్లమెంట్ ప్రాంగణంలో రామమందిరం విరాళాల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు స్కిట్ ప్రదర్శించారు. దాని తర్వాత ఈ దాడి జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎంపీ పప్పు యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఎంపీ అనుచరులు వెంటనే నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఈ సందర్భంగా దుండగుడి వద్ద కత్తి ఉన్నట్లు వారు ఆరోపించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి యత్నించిన వ్యక్తిని సుమిత్(34)గా గుర్తించారు. అతడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో పనిచేస్తున్నాడని, స్వస్థలం బులంద్‌షహర్‌గా తెలిపారు. నిందితుడితో పాటు కారులో బయట వేచి ఉన్న హ్యాపీ అనే మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. శనివారం రాత్రే ఢిల్లీ నివాసానికి తాను చేరుకున్నానని, మరుసటి రోజే హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. తాను చాలాకాలంగా భద్రత కల్పించాలని కోరుతున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు స్పందించలేదని విమర్శించారు. 'నన్ను చంపే ప్రయత్నం జరిగింది. కొందరు కాల్చి చంపండని, మరికొందరు చంపేయండని అరుస్తున్నారు. అక్కడ ఉన్నవారు అడ్డుకోకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. రాముల వారి 200 కిలోల వెండి ఎక్కడికి వెళ్లింది? బంగారం ఏమైంది? అని మాత్రమే ప్రశ్నించాను' అని పప్పు యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కర్ణాటక శివమొగ్గ జిల్లాలో విషాదం.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి..
లారీని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఐదుగురి మృతి..