Share News

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం.. ఐదోరోజూ గాలింపు

ABN , Publish Date - Nov 25 , 2026 | 09:38 AM

ఎన్టీఆర్ జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. టైగర్ ఆపరేషన్ ఐదోరోజుకు చేరుకుంది. ప్రస్తుతం పులి కనుమూరు ఫారెస్ట్‌లోనే మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు.

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం.. ఐదోరోజూ గాలింపు
NTR District Tiger

ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 25: జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. టైగర్ ఆపరేషన్ ఐదోరోజుకు చేరుకుంది. ప్రస్తుతం పులి కనుమూరు ఫారెస్ట్‌లోనే మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. ట్రాకర్ సంకేతాలపై సిగ్నల్ సమస్యతో కొంత అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు నిరంతర గాలింపు చర్యలు చేపట్టారు.


గంపలగూడెం మండలం కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి సంచారం ఐదో రోజుకు చేరింది. గత ఐదు రోజులుగా అదే అటవీ ప్రాంతంలో పులి తిష్ట వేయడంతో అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు అప్రమత్తమయ్యారు. రెండు రోజులుగా ట్రాకర్ ద్వారా పులి కదలికలకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా అందడం లేదని సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినప్పుడు ట్రాకర్ సంకేతాలను గుర్తించడంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులికి అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా లభించడంతో పాటు అనువైన అటవీ వాతావరణం ఉండటంతో కనుమూరు ఫారెస్ట్‌లోనే తిష్ట వేసినట్లు సమాచారం.


ట్రాకర్ సంకేతాలు స్పష్టంగా అందకపోయినా అధికారులు.. వెనక్కి తగ్గకుండా అటవీ ప్రాంతానికి అన్ని వైపులా నిఘా ఏర్పాటు చేశారు. పులి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతర గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఒంటరిగా అటవీ ప్రాంతాలు, పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెద్దపులి సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

బంగారానికి పెరిగిన డిమాండ్.. ధరలు జంప్

ఏపీలో భారీ పెట్టుబడులు.. 54, 210 మందికి ఉపాధి అవకాశం!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 09:46 AM