చెదురుమదురుగా వర్షాలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:18 AM
నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి ముఖ్యంగా...
నాలుగు రోజులు మేఘావృతం
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి ముఖ్యంగా తమిళనాడు దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో సోమవారం రాత్రి నుంచి పలుచోట్ల మేఘాలు ఆవరించి వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నెల్లూరు జిల్లా చింతవరంలో 86, ప్రకాశం జిల్లా నాగులుప్పాడులో 81, నెల్లూరు జిల్లా కోటలో 76 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30 గంటలు నుంచి సాయంత్రం వరకు ఏలూరు జిల్లా ఉంగుటూరులో 72.3, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 43.5, నెల్లూరు జిల్లా కొండాపురంలో 39.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే ఎక్కువ నమోదయ్యాయని పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం వెల్లడించింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, అల్లూరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.