అలాంటి వారికి పోలీసు ట్రీట్మెంట్ ఖాయం.. మంత్రి అనిత వార్నింగ్
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:52 PM
టీడీపీ కార్యకర్తలను గత 20 నెలలుగా పూర్తి అదుపులో పెట్టాం కాబట్టే రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొందని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ ఉచ్చులో పడకుండా టీడీపీ శ్రేణులను నియంత్రించామని అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 3: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఎలాంటి పొంతన లేదని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తల కోపాన్ని అదుపు తప్పకుండా సంయమనం పాటించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
నాయకులకు వాస్తవాలను వివరించి, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను గుర్తు చేసి.. వైసీపీ ఉచ్చులో పడకుండా నియంత్రించామన్నారు హోంమంత్రి. టీడీపీ కార్యకర్తలను గత 20 నెలలుగా పూర్తి అదుపులో పెట్టాం కాబట్టే రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొందని తెలిపారు. కార్యకర్తల కడుపు మంటను అర్థం చేసుకున్నప్పటికీ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సరైన సమయంలో హితబోధ చేసిన నాయకుడు చంద్రబాబు అని అనిత కొనియాడారు. గతంలో 'బోసు డీకే' అనే పదానికి బూతు సృష్టించి టీడీపీ కార్యాలయంపై జగన్ దాడి చేయించారని గుర్తుచేశారు. ఆ పదానికే తన కార్యకర్తలకు బీపీలు వచ్చాయని జగన్ సమర్థించుకున్నారని మంత్రి తెలిపారు.
వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తుంటే కూడా తమ అధినేత ఇప్పటికీ సంయమనం పాటించమని సూచిస్తున్నారని హోంమంత్రి అన్నారు. హింసను, విధ్వంసాన్ని ప్రోత్సహించి ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. బూతులు, హింసాత్మక చర్యలతో వైసీపీ నేతలను ప్రోత్సహించారే తప్ప ఏనాడైనా తప్పని చెప్పారా అంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఒక క్రిమినల్ ఆలోచనా విధానాలను, విజనరీ ఆలోచనలను అర్థం చేసుకున్నారని అన్నారు. క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేయాలనే ఆలోచన రావాలంటేనే భయపడేలా రాజకీయ రౌడీలకు పోలీసు ట్రీట్మెంట్ ఇస్తామని మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన
అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు
Read Latest AP News And Telugu News