Share News

ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారు: ఎమ్మెల్యే గౌతు శిరీష

ABN , Publish Date - Apr 17 , 2026 | 02:51 PM

2023 ఎన్‌సీఆర్‌బీ నివేదికే జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమన్నారు.

ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారు: ఎమ్మెల్యే గౌతు శిరీష
Gouthu Sireesha

అమరావతి, ఏప్రిల్ 17: మహిళా బిల్లు వేళ వైసీపీ డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష(Gouthu Sireesha) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే.. ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం.. ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 2023 ఎన్‌సీఆర్‌బీ(NCRB)నివేదికే జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమన్నారు. పెద్ద రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.


అలాంటి నీచ చరిత్ర వైసీపీది..

మాజీ మంత్రి విడుదల రజినీ.. టీడీపీపై విమర్శలు చేసే ముందు గత వైసీపీ హయాంలో జరిగిన నేరాల చిట్టా చూడాలని ఎమ్మెల్యే హితవుపలికారు. జగన్ హయాంలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి వర్గం మీద వైసీపీ దమనకాండ సాగించిందని విమర్శించారు. రాజధాని ఆడబిడ్డలను రోడ్ల మీద ఈడ్చిన చరిత్రను ఆంధ్రరాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, ముఖ్యంగా మహిళలను ఐదేళ్లపాటు నరకయాతన పెట్టారని ఆరోపించారు. కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న మహిళలను అడ్డుకుని, కనీసం ఇస్తరాకులు కూడా లేకుండా రోడ్డుపై అన్నం తినేలా చేసిన క్రూరత్వం వైసీపీది అంటూ విరుచుకుపడ్డారు. పాదయాత్ర చేస్తున్న మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ డ్రోన్ల ద్వారా నిఘా పెట్టిన నీచ చరిత్ర వైసీపీది కాదా అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.


సొంత తల్లిని, చెల్లిని గౌరవించలేదు...

వైసీపీ సోషల్ మీడియా వింగ్ ద్వారా తెలుగుదేశం, జనసేన వీరమహిళలపై అత్యంత అశ్లీలమైన, నీచమైన పోస్టులు పెట్టించారని గౌతు శిరీష మండిపడ్డారు. లక్షలాది ఫేక్ అకౌంట్లతో మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ, వారిని రాజకీయాల నుంచి తరిమేయాలని చూశారన్నారు. సొంత పార్టీ నాయకురాలైన వైఎస్ షర్మిలమ్మపై కూడా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేయించిన సంస్కృతి జగన్‌ది అని విమర్శించారు. అక్కా చెల్లెమ్మలు అని మాటలు చెప్పే జగన్ రెడ్డి.. తన సొంత తల్లిని, చెల్లిని గౌరవించలేకపోయారన్నారు. తండ్రి ఆస్తిలో వాటా అడిగినందుకు తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టడం, చెల్లిపై సోషల్ మీడియాలో దాడి చేయించడం ఏ రకమైన మహిళా పక్షపాతమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా...

బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం పోరాటం చేస్తున్న సునీతా రెడ్డిని సాక్షి పేపర్ ద్వారా వేధిస్తూ, ఆమె మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. కల్తీ మద్యంతో వేల కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన దైవం నందమూరి తారక రామారావు అని తెలిపారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన విజేత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా సరే.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షించే క్రమశిక్షణ టీడీపీది అని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన

అనకాపల్లిలో స్వల్ప భూకంపం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 02:51 PM