Share News

పాలసీలు తీసుకురావడం సులభమే.. అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:36 PM

2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ ఐదేళ్లూ విధ్వంసం జరిగిందన్నారు.

పాలసీలు తీసుకురావడం సులభమే.. అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, జులై 14: 2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ ఐదేళ్లూ విధ్వంసం జరిగిందన్నారు. ఈరోజు(మంగళవారం) మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశంలో సీఎం మాట్లాడుతూ... గడిచిన రెండేళ్లు సమష్టిగా పనిచేశామని.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పామన్నారు. ప్రభుత్వ ఆలోచనల్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్ధంగా అమలు చేసిందని కొనియాడారు. ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామని.. మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.


ప్రతి ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు తాము సాధించిన ఫలితాలను బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించటంతో పాటు జీఎస్డీపీని విశ్లేషించుకుంటున్నామని చెప్పారు. 2047 వికసిత్ భారత్ బాటలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్‌ రూపకల్పన చేశామన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు, 57 కేబినెట్ సమావేశాలు నిర్వహించామన్నారు. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయిందన్నారు. కానీ ఆ పరిస్థితిని పునరుద్ధరించామని.. మళ్లీ ఏపీ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేష‌న్‌గా అవతరించిందని వెల్లడించారు. పెద్దఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని.. తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయన్నారు.


వనరుల్ని సమర్ధంగా వినియోగించుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీని పారిశ్రామికంగానూ అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. రాయలసీమలో ఉద్యాన పంటలు, ఖనిజ వనరులు, కోస్తా జిల్లాల్లో ఆక్వా ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, చీమకుర్తి గ్రానైట్ సహా విలువైన వనరులకు వాల్యూ అడిషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇన్నోవేషన్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ‘టెక్నాలజీ, వనరులు, నాలెడ్జి మన వద్ద ఉంది. దానిని అందిపుచ్చుకునే నాయకత్వం మనకు కావాలి’ అని పేర్కొన్నారు. పాలసీలు తీసుకురావటం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. ఇక నుంచి నెల వారీ ఆర్థిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రతి నెలా ఒకసారి కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశం నిర్వహించుకోవటం ద్వారా పురోగతిని సమీక్షించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో ‘సర్‌’ ప్రక్రియ ముమ్మరం.. 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి

డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 04:37 PM