Share News

ఏపీలో ‘సర్‌’ ప్రక్రియ ముమ్మరం.. 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:19 PM

ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది.

ఏపీలో ‘సర్‌’ ప్రక్రియ ముమ్మరం.. 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి
AP SIR Enumeration

అమరావతి, జులై 14: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈరోజు(జులై 14) ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలోని మొత్తం 4.16 కోట్ల(4,16,27,694) మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4.14 కోట్ల(4,14,86,830) మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 12.29 లక్షల(12,29,224) ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది.


100శాతం పూర్తైన జిల్లాలు ఇవే

ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 100 శాతం ప్రక్రియ పూర్తయింది. అలాగే శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, మార్కాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, ప్రకాశం జిల్లాలోనూ 100 శాతానికి ప్రక్రియ చేరింది. దీంతో మొత్తం 13 జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది.


చివరి స్థానాల్లో ఉన్న జిల్లాలు ఇవే..

కొన్ని జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 98.21 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తైంది. అక్కడ ఇంకా 35,383 ఫారాల డిజిటలైజేషన్ పెండింగ్‌లో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 98.50 శాతం పూర్తి కాగా 25,805 ఫారాలు, వైఎస్ఆర్ జిల్లాలో 99.10 శాతం పూర్తి కాగా 17,067 ఫారాలు ఇంకా డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 756, వైఎస్ఆర్ జిల్లాలో 618 పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.


గడువు పెంపు కోరుతూ లేఖ..

ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 10 రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(CEO) లేఖ రాశారు. గడువు పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు. దీంతో గడువు తేదీ పొడిగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

వియత్నాం బోటు ప్రమాదం.. శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు

కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 02:35 PM