Share News

డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:08 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

డొనేషన్ స్కీంలో మార్పులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. టీటీడీ కీలక నిర్ణయం
TTD Board Meeting

తిరుమల, జులై 14: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు(మంగళవారం) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలోని 72 అంశాలను చర్చించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. నిత్య హారతులపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని.. తిరుమలలోని నిబంధనలపై లేఖ ద్వారా ఆయనకు తెలియజేయనున్నట్లు చెప్పారు. రూ.6.31 కోట్లతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్డీ టోకెన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లను నిర్మిస్తామన్నారు. కుమారధార, పసుపు ధార వద్ద రూ.2.77 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి కోసం జీఎన్సీ వద్ద 800 కిలో వాట్స్ విండ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.


ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన వారికి రూ.50 టికెట్ ధరను నిర్ణయించామని, మ్యూజియం నిర్వహణను టాటా కంపెనీకి ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపుతామని టీటీడీ చైర్మన్ చెప్పారు. కాకుల మానుకొండ వద్ద ఉన్న వేల టన్నుల వేస్ట్‌ను తరలించేందుకు రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ ఆలయాల్లో రూ.2.35 కోట్లతో ఫైర్ సేఫ్టీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏటీసీ, టీబీసీ వద్ద 12 పాత భవనాలు తొలగించి దాతల సహకారంతో నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. 2027 డైరీ, క్యాలెండర్ ప్రింటింగ్ టెండర్లను అతి తక్కువ ధరకే ఇచ్చేలా ఆమోదం తెలిపామన్నారు. రూ.2.91 కోట్లతో అక్టోపస్ బేస్ క్యాంపు వద్ద ఎఫ్ఎంఎస్ పనుల నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు.


ఒంటిమిట్టలో బంగారు కవచం తయారీకి కేజీ బంగారు ఇచ్చేందుకు సమావేశంలో ఆమోదం తెలిపామని టీటీడీ చైర్మన్ అన్నారు. రూ.17.86 కోట్లతో 100 గదుల నిర్మాణానికి ఆమోద ముద్ర వేశామన్నారు. ఒంటిమిట్ట ఆలయ మాడవీధుల విస్తరణ కోసం రూ.2.11 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్య పారాయణం కోసం 791 వేద పండితుల పోస్ట్‌ల నియామకానికి ఆమోదం తెలిపామన్నారు. డీపీపీలోని కళాకారుల జీతభత్యాల పెంపునకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 65 సర్వర్ పో‌స్ట్‌లను క్యాటరింగ్ సూపర్‌వైజర్లుగా పదోన్నతికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాలని సమావేశంలో నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.


డొనేషన్ స్కీంలో మార్పులు: ఈవో రవిచంద్ర

డొనేషన్ స్కీంలో మార్పులు చేశామని ఈవో రవిచంద్ర అన్నారు. భక్తులకు ఆమోదయోగ్యంగా ఉండేలా నూతన పాలసీని తీసుకొచ్చామన్నారు. సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యం ఇచ్చేందుకు డోనర్స్ ప్రివిలేజ్స్‌ని తగ్గించామని తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి నూతన పాలసీ అమలులోకి వస్తుందని ఈవో రవిచంద్ర వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

ఏపీలో ‘సర్‌’ ప్రక్రియ ముమ్మరం.. 99.66 శాతం డిజిటలైజేషన్ పూర్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 04:38 PM