Share News

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం.. వైసీపీపై సీఎం సీరియస్

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:24 PM

హెరిటేజ్‌ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు.

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం.. వైసీపీపై సీఎం సీరియస్
CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 24: హెరిటేజ్ సంస్థ తమ కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వంలో ఎక్కడా హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఏపీ శాసనసభలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇప్పటివరకు హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు ఈ సంస్థపై వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి, నిజాయతీతోనే హెరిటేజ్ నిలబడిందని చెప్పారు.


భారతీ సిమెంట్స్ నుంచి ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో సిమెంట్ వినియోగించారని సీఎం గుర్తుచేశారు. నేరస్థులు ఏ విధంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరించి నీతి నిజాయతీతో హెరిటేజ్ సంస్థ వ్యాపారం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.


ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు నెయ్యి విషయంలో ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పుణేలోని ఇందాపూర్ డెయిరీ ప్రముఖ కంపెనీలన్నింటికీ కో-మ్యానుప్యాక్చరింగ్ చేస్తోందన్నారు. మదర్ డెయిరీ, బ్రిటానియా, పతంజలి ఆయుర్వేద ఘీ, డీమార్ట్, రిలయన్స్, దొడ్ల, హ్యాట్సన్, జీఆర్‌బీ, అమూల్, హెరిటేజ్ వంటి సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోందని వివరించారు. ఇలాంటి కో-మ్యానుప్యాక్చరింగ్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు.


రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటన జరిగితే.. దానిపై చర్చించకుండా ప్రతిపక్షాలు మండలిని అడ్డుకున్నాయని సీఎం ఆరోపించారు. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై చర్చించి తగిన చర్యలు చేపట్టిందని చెప్పారు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదని స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలని సూచించారు. దేవాలయాల పవిత్రతను దెబ్బతీయొద్దన్నారు. హైందవ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. వేర్వేరు మతాలకు చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి రామానాయుడు

జగన్‌ ఎందుకు వెనకేసుకొస్తున్నారు.. మీకూ భాగస్వామ్యముందా?: డిప్యూటీ సీఎం పవన్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 04:30 PM