జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు.. మీకూ భాగస్వామ్యముందా?: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:30 PM
నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతోంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై లఘు చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సభలో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని.. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పుచేశారని తానెక్కడా చెప్పలేదని.. అప్పటి టీటీడీ పాలకమండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైందని విమర్శించారు.
తాము ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయడం లేదని.. జగన్ నియమించిన బోర్డు హయాంలోనే తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. నాటి టీటీడీ బోర్డు సభ్యులను మాజీ సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ‘దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవచ్చని జగన్ చెబితే సరిపోయేది.. వెనకేసుకొస్తున్నారంటే మీకూ భాగస్వామ్యం ఉన్నట్టే కదా?’ అని అనుమానం వ్యక్తం చేశారు పవన్. అసలు నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ నేతలు చెప్పడమేంటని నిలదీశారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని చెప్పారు. నచ్చినవారికి కాంట్రాక్టులు ఇచ్చుకునేందుకు నిబంధనలు సడలించారని పవన్ ఆరోపించారు.
రూ.20 కోట్ల లడ్డూలు రసాయనాల నెయ్యితో తయారైనట్టు తేలిందని, రసాయనాలతో తయారైన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపారని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో దోషులెవరైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారాయన. ఆ నెయ్యిలో.. ఏ రసాయనాలు ఉన్నాయో శ్రీవారికే తెలియాలన్నారు డిప్యూటీ సీఎం. నెయ్యిలో జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ(NDDB) రిపోర్టు ఇచ్చిందని.. అది అసలు నెయ్యే కాదని సీబీఐ సిట్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఇది స్వామివారికి కాకుండా ఇతర ఏ మతానికి జరిగినా దేశం గగ్గోలు పెట్టేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే పశు వైద్యశాలల్లో వైద్యుల నియామకం: మంత్రి అచ్చెన్నాయుడు
గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి రామానాయుడు
Read Latest AP News And Telugu News