Share News

ఆ మూడు నగరాలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి దుర్గేశ్

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:36 PM

విశాఖను అడ్వెంచర్, యాంకర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.

ఆ మూడు నగరాలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి దుర్గేశ్
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విశాఖ నగరం కీర్తి కిరీటంగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.8,650 కోట్ల పెట్టుబడులతో 50 ఎంవోయూ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.


సీ-ప్లేన్, క్రూజ్ సర్క్యూట్, హెలీ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి దుర్గేశ్ చెప్పారు. విశాఖను అడ్వెంచర్ , యాంకర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలం దేవస్థానానికి రూ.54.04 కోట్లు, స్వదేశీ దర్శన్ 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి రూ.28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని వివరించారు. రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తనీ బ్యాక్ వాటర్స్‌లో స్కూబా డైవింగ్, పారా మోటరింగ్ వంటి 10 రకాల జలక్రీడలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో మరింత ఊతం వచ్చిందని మంత్రి అన్నారు. క్యారవాన్ పాలసీలో భాగంగా అన్ని ప్రాంతాల్లో క్యారవాన్ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాఖలో ‘హాప్-ఆన్, హాప్-ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు’ సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 'సీఆర్‌జెడ్ 19' అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. 2019-24 కాలంలో కుదేలైన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందని ఆయన వివరించారు. నూతన పర్యాటక పాలసీ 2024-29తో విస్తృతంగా పెట్టుబడులు వచ్చాయన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

త్వరలోనే పశు వైద్యశాలల్లో వైద్యుల నియామకం: మంత్రి అచ్చెన్నాయుడు

గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి రామానాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 01:48 PM