Share News

మున్సిపల్ చైర్మన్లలో 94 శాతం స్ట్రైక్ రేట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 09 , 2026 | 12:53 PM

స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం వరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌, గుడ్‌ పాలిటిక్స్‌ను నమ్ముతానని.. తన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్లలో 94 శాతం స్ట్రైక్ రేట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, నవంబర్ 9: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం వరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ... గుడ్‌ గవర్నెన్స్‌, గుడ్‌ పాలిటిక్స్‌ను నమ్ముతానని.. తన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారని తెలిపారు. 2024 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ‘2024లో మాకు 55.3 శాతం ఓట్లు వస్తే.. వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి’ అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు వస్తే.. వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. వైసీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయన్నారు. మున్సిపల్‌ చైర్మన్లలో 94 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించామన్నారు.


పోస్టల్‌ బ్యాలెట్‌లో 67 శాతం ఓట్లు

ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతంపైనే కూటమి కైవసం చేసుకుందని.. 659 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 575 స్థానాల్లో విజయం సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అల్లూరి జిల్లా మినహా అన్ని జడ్పీలు గెలిచామని వివరించారు. 7 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ కూడా వైసీపీ గెలవలేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కూటమికి 67 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఈవీఎమ్‌లను ట్యాంపర్ చేశారని వైసీపీ ఆరోపించిందని.. ఇప్పుడు బ్యాలెట్లను రిగ్గింగ్‌ చేశారంటున్నారని విమర్శించారు. మరి పోస్టల్‌ ఓట్ల సంగతేంటి అని ప్రశ్నించారు.


కూటమి పాలనకు పట్టం..

కూటమి పాలనకు ప్రజలు పట్టం కట్టారని.. అన్ని ప్రాంతాల్లోనూ కూటమిని ప్రజలు ఆదరించారని చంద్రబాబు తెలిపారు. ఈ ఫలితాలు సంక్షేమం, అభివృద్ధి పాలనకు దక్కిన గౌరవమన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమిగా ఏర్పడ్డామని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్‌తో పరిపాలన మొదలుపెట్టామని.. స్పష్టమైన విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని చెప్పారు. కరవును జయించడమే ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం అన్నారు. ఖరీఫ్‌లో 53 శాతం లోటు వర్షపాతం ఉందని.. ముందుచూపుతో ఆలోచించడం వల్లే గతేడాది నీటిని పొదుపుగా వాడుకున్నామన్నారు. పోలవరాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, గోదావరి-కావేరి అనుసంధానం జరిగితే కరవు ఉండదని సీఎం వెల్లడించారు.


టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ

కార్యకర్తలు కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ టీడీపీ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. డబ్బుతో కాదు సేవాభావంతో రాజకీయం చేయాలని సూచించారు. ఎల్‌నినో, అర్నబ్‌, మురసు తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని.. నాయకుడు మారినా కార్యకర్త జెండా వదలడని అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఎంతో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించామన్నారు. కష్టపడే కంటే.. టెక్నాలజీతో స్మార్ట్‌గా పనిచేయాలని పేర్కొన్నారు.


డ్రామాలతో ప్రజాతీర్పును మార్చలేరు..

బీసీ రిజర్వేషన్లు ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసీపీపై సీఎం విమర్శలు గుప్పించారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఆ పార్టీ కుట్రలు చేసిందని ఆరోపించారు. గొడ్డలి పార్టీ నాయకుల తీరు కరెక్ట్‌ కాదని.. గొడ్డలి పార్టీది హిట్‌ అండ్‌ రన్‌ పాలసీ అంటూ వ్యాఖ్యానించారు. రప్పా.. రప్పా.. రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నడూ జరగనంత ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరిగాయని తెలిపారు. కొన్నిచోట్ల మాత్రం గొడ్డలి పార్టీ హింసకు పాల్పడిందన్నారు. నేరాలు, హింసా మార్గాలనే గొడ్డలి పార్టీ నమ్ముకుందని అన్నారు. డ్రామాలతో ప్రజాతీర్పును ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.


మా కష్టాన్ని ప్రజలు గుర్తించారు

వైసీపీకి ఓటు వేయడానికి ప్రజలు ఇష్టపడలేదని ముఖ్యమంత్రి అన్నారు. అయితే కూటమి.. లేదంటే రెబల్స్‌కు ఓటువేశారని తెలిపారు. చీరాలలో వైసీపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. కడపలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలొస్తాయన్నారు. ‘మా కష్టాన్ని ప్రజలు గుర్తించారని.. ప్రజాతీర్పు మా బాధ్యతను మరింత పెంచింది’ అని వెల్లడించారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని.. ఎక్కడైనా తప్పులుంటే సరిచేసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మెదక్‌లో చిరుత కలకలం.. రోడ్డు దాటుతుండగా వీడియో తీసిన యువకుడు

ఏపీలో మూడు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు.. ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 01:35 PM