Share News

సంజీవని ప్రాజెక్టు, ఆర్టీజీఎస్, అమరావతిపై బిల్ గేట్స్ ప్రశంసలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:25 PM

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్‌ గేట్స్ తెలుసుకున్నారు.

సంజీవని ప్రాజెక్టు, ఆర్టీజీఎస్, అమరావతిపై బిల్ గేట్స్ ప్రశంసలు
Bill Gates AP Visit

అమరావతి, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (CM Chandrababu Naidu) కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు బిల్ గేట్స్. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్‌ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజెంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు గేట్స్.


అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు సీఎం తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని... అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ కొనియాడారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

chand-bill-1.jpg


తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని సీఎం తెలుపగా.. గ్రేట్ అంటూ కితాబిచ్చారు బిల్ గేట్స్.


బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను గేట్స్ అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించగా.. ‘గ్రేట్ వర్క్’ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు.


ఇవి కూడా చదవండి...

గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: మంత్రి లోకేశ్

చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 12:44 PM