హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద.. ఇదే ఆ ఛానల్ పరిస్థితి: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Sep 15 , 2026 | 04:18 PM
నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.
అమరావతి, సెప్టెంబర్ 15: నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చిందని వెల్లడించారు. ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక.. తప్పుడు కథనాలతో అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులు కోరిన విధానాన్నే అమలు చేస్తే అక్రమమా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా నియామకాలు జరగలేదని నిరుద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసిందని తెలిపారు.
ఈ ఒక్కసారికి పాత వెయిటేజీ విధానంలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. G.O.Ms.No.52 ప్రకారం మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామక విధానం ఉందన్నారు. BVSc మార్కులకు 60, MVScకు 10, కాంట్రాక్ట్ సేవలకు 10 మార్కుల వెయిటేజీ కేటాయించినట్లు తెలిపారు. అలాగే సీనియారిటీకి ప్రతి ఏడాదికి 4 మార్కుల చొప్పున వెయిటేజీ ఇవ్వనున్నట్లు చెప్పారు. గరిష్ఠంగా 20 మార్కుల వెయిటేజీ పొందే అవకాశం ఉంటుందన్నారు. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. APPSCకి ప్రస్తుత పని ఒత్తిడి కారణంగా వెయిటేజీ విధానంలో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదన్నారు. G.O.Ms.No.22 ద్వారా ఈ ఒక్కసారికి పశుసంవర్ధక శాఖ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్ నియామకాలు APPSC పరీక్షా విధానంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
సాక్షిలో చెప్పినట్టు ప్రస్తుతం డైరెక్టర్‌గా దామోదర్ నాయుడు లేరని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒక మహిళా అధికారి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. కనీసం డైరెక్టర్ ఎవరో తెలుసుకోకుండా కథనం రాస్తారా? అంటూ మండిపడ్డారు. ‘హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద.. ఇదే సాక్షి పరిస్థితి’ అని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వడం తమ విధానమని.. ఉద్యోగాలకు అడ్డుపడటం వైసీపీ విధానమని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని వైసీపీకి హితవు పలికారు. యువతకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
Read Latest AP News And Telugu News