స్త్రీశక్తి పథకానికి ఏడాది.. మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు ప్రయాణం
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:40 PM
స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
అమరావతి, ఆగస్టు 15: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.
పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు బస్సులో మహిళలతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు తెన్నుల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళల కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. ఓ మహిళా రైతుతో సంభాషించిన ముఖ్యమంత్రి... ప్రభుత్వం ఇచ్చే పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. చేపలు అమ్ముకునే ఓ మహిళతో సీఎం మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా తనకు నెలకు రూ. 4 వేలు ఆదా అవుతోందని మత్స్యకార మహిళ తెలిపింది. మత్స్యకార మహిళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం. తనకు చక్కెర వ్యాధి ఉందని... ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధితో మందులు కొనుగోలు చేస్తున్నట్టు సదరు మహిళ వెల్లడించింది. ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్యం దరిచేరదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటే... సంపాదనను మందుల కొనుగోలు ఖర్చులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు.
స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు రూ. 1500 ఆదా అవుతోందని నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళ తెలిపింది. స్త్రీ శక్తి పథకం సహా తనకు మొత్తంగా నాలుగు పథకాలు అందుతున్నాయని మహిళ పేర్కొంది. అలాగే విద్యార్థినులకు స్త్రీ శక్తి పథకం చాలా ఉపయోగంగా ఉందని ఓ యువతి వెల్లడించింది. స్త్రీ శక్తి పథకంతో పాటు.. నేతన్న సేవలో పథకం ద్వారా మరింత ఆదాయం వస్తోందని ఉమ్మడి అనంతపురానికి చెందిన చేనేత మహిళ తెలిపింది. ముడి సరుకు తెచ్చేందుకు... నేసిన చీరలను షాపులకు మార్కెటింగ్ చేసేందుకు స్త్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నామని మహిళ పేర్కొంది. గతంలో తన భర్త ఒక్కరే బయటకు వెళ్లి వ్యాపారం చేసేవారని... ఇప్పుడు తాను కూడా బయటకు వెళ్లి వ్యాపారాభివృద్ధి కోసం పని చేయగలుగుతున్నామని చేనేత మహిళ చెప్పుకొచ్చింది.
ఏపీలోని పేద, మధ్య తరగతి ప్రజలు, కుటుంబాల స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ తరహాలో తాను ముఖాముఖి అవుతున్నానని మహిళలకు సీఎం చంద్రబాబు చెప్పారు. 5 కేటగిరీల బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు అవుతోందని.. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో వివిధ వర్గాల మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. రోజుకు 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారన్నారు. APSRTCలోని 9,978 బస్సుల్లో.. 7,631 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతోందని తెలిపారు. మొత్తం APSRTCలో ఉన్న 76 శాతం బస్సుల్లో పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తికి ముందు బస్సు ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా.. పథకం అమలుతో 62 శాతం మహిళల ప్రయాణాలు పెరిగాయన్నారు. స్త్రీ శక్తి అమలుతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News