జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:07 AM
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. జాతీయ జెండా మన ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్‌కు మార్గదర్శకమని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 15: జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. జాతీయ జెండా మన ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్‌కు మార్గదర్శకమని తెలిపారు. 80వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం రాజధాని అమరావతిలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య తేలిగ్గా.. ఒక్క రోజులో.. ఒకరి పోరాటంతో రాలేదన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం.. ఎన్నో తరాల ఉద్యమంతో వచ్చిందని పేర్కొన్నారు. ఎందరో మహనీయల బలిదానం.. ఎందరో అమరుల ప్రాణత్యాగంతో వచ్చిందని గుర్తు చేశారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేసుకుందని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య తెలుగు నేలకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలని యువతకు ఆయన స్పష్టం చేశారు. నా దేశం.. నా బాధ్యత అని ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. 2047 నాటికి దేశం, ఏపీని నెంబర్ వన్‌గా నిలపాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధనకు రానున్న 20 ఏళ్లు కష్టించి పనిచేయాలన్నారు. స్వర్ణాంధ్ర కోసం చేసే ప్రతి పని వికసిత్ భారత్‌లో భాగం కావాలన్నారు. ప్రతి సారి సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు ఐదేళ్లు ఏపీని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచక పాలన సాగించారని అన్నారు.
2024 ఎన్నికల్లో కూటమిపై నమ్మకంతో ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన సాగిస్తున్నామన్నారు. కేంద్రం సహకారంతో ఏపీకి కొత్త ఊపిరి వచ్చిందని చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పాలన చేస్తున్నామని స్పష్టం చేశారు. 10 సూత్రాల అజెండాతో ముందుకు సాగుతున్నామని వివరించారు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాదు.. కార్యాచరణను సిద్ధం చేసుకున్నామని అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.
ఇవి కూడా చదవండి...
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News