ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:54 AM
దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్ర్యం అని వివరించారు. తొలిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతరం గీతాన్ని ఆలపించామని అన్నారు. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని ప్రధాని మోదీ తెలిపారు. సంకల్పం, కలలు ఉన్నతంగా ఉంటే.. సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందన్నారు. శౌచాలయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు 3 రెట్ల వేగంతో నిర్మించామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మెట్రోరైళ్ల సదుపాయాలు పెంచామని వివరించారు.
ఆత్మనిర్భర భారత్ సాధనే మన లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆత్మ విశ్వాసం పెంచుకోవడంతోపాటు స్వయం సమృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని అన్నారు.
డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంబన దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మూడు ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు చేపట్టాయని గుర్తు చేశారు. ఏడెనిమిదేళ్లలో దాదాపు 8 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
200 గిగావాట్ల అణుఇంధనం ఉత్పత్తి మన లక్ష్యమన్నారు. అలాగే ఐదు అణు రియాక్టర్ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని 70 నగరాల్లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందిస్తు్న్నామని చెప్పారు. 1.75 కోట్ల ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ అందిస్తున్నామని వివరించారు. ఇంధన భద్రత సాధించడం దేశ తక్షణ అవసరం అని నొక్కి చెప్పారు.
దేశాభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 12 ఏళ్లలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు. రైల్వే కోచ్, మొబైల్ ఫోన్ల తయారీ పెరిగిందని వివరించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 100 రెట్లు పెరిగాయని గుర్తు చేశారు. ప్రతీ పని అనేక రెట్ల వేగంతో జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే ఎలక్ట్రిఫికేషన్‌ను 30 నుంచి వందశాతానికి పెంచామన్నారు. తాజాగా తొలి హైడ్రోజన్ రైలును కూడా ప్రారంభించామని వివరించారు. అనేక చట్టాలను మార్చాని తెలిపారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి బయటపడగానే యుద్ధాలు ముంచేశాయని పేర్కొన్నారు. ముందు ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం అని వివరించారు. యుద్ధాలు వస్తే ఇంధనం, ఎరువులు దొరకవని కొందరు భయపెట్టారని.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు లోటు రానివ్వలేదని చెప్పారు. సంక్షోభం వస్తుందని ముందే ఊహించి.. ముందస్తు ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. యూరియా, డీఏపీ ధరలు పెరిగినా.. ఇక్కడ సబ్సిడీకి ఇస్తున్నామని పేర్కొన్నారు.
భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 2014 తర్వాత 40 దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్‌లు చేశామని గుర్తు చేశారు. మన టెక్స్‌టైల్, ఫార్మా, మత్స్య సంపద మనల్ని రక్షిస్తోందని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు పెరగాలని ఆకాంక్షించారు. గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి 4 రెట్లు పెరిగిందన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి 5 రెట్లు పెరిగిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగిందని వివరించారు. భారత్ 6జీ టెక్నాలజీని ప్రపంచమంతా తీసుకెళ్లాలని తెలిపారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత్ నుంచి 50 సంస్థలు ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
దేశంలో నక్సలిజాన్ని అంతమొందించామన్నారు. నక్సలిజం, మావోయిజం ఎంతోమంది యువకులను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారో.. నక్సలిజంతో అంతమంది పోలీసులు చనిపోయారని పేర్కొన్నారు. నక్సలిజం భావజాలం ఉన్నవారిని కట్టడి చేయాల్సి ఉందన్నారు. కానీ దేశంలో చాలామంది మావోవాదులు ఉన్నారని చెప్పారు. వారి మనసుల్లో మావోయిజం, నక్సలిజం ఇంకా ఉందని తెలిపారు. అలాంటి వారిని కనిపెట్టి నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కోటా అందాల్సి ఉందన్నారు. మహిళా బిల్లుకు సహకరించి ఆ ఘనత మీరే తీసుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో జనగణన ఎంతో కీలకమని పేర్కొన్నారు. పథకాల రూపకల్పనకు జనగణన సమాచారం కీలకమని అభివర్ణించారు. జనగణనకు యువత సహకరించాల్సి ఉందన్నారు. జనగణన నమోదులో తప్పులు లేకుండా చూడాలని యువతకు ఆయన స్పష్టం చేశారు. అందుకోసం యువతకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందిస్తామని ప్రధాని మోదీ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు
ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
For More National News And Telugu News