ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:30 AM
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది.
జకార్తా, ఆగస్టు 15: ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది. దీంతో తూర్పు నుసా తెంగారాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు గంటన్నర వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపనలు సంభవించాయని వివరించింది. దీంతో జనం భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీసినట్లు తెలిపింది.
ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరో వైపు సముద్రంలోని కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రజలను ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.