Share News

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:59 AM

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Independence Day 2026

అమరావతి, ఆగస్టు 15: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈఏడాది తొలిసారిగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జాతీయ జెండా వేడుకలను నిర్వహించారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు.


  • ఏపీ అసెంబ్లీలో 80వ స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ​జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ ​కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తదితరులు పాల్గొన్నారు. ​జాతీయోద్యమ నాయకులు, రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులకు స్పీకర్ ఘన నివాళులర్పించారు. ​మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. ​ఏపీ శాసనసభ ఐదు కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

  • చిత్తూరు జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు చిత్తూరు గురుజాల జగన్మోహన్, పూతలపట్టు మురళీమోహన్, చూడ చైర్మన్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డుడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాల్గొన్నారు.


  • కడప జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌం‌‌డ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడితో కలిసి ప్రత్యేక వాహనం ద్వారా పరేడ్‌ను కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం వేదికపై నుంచి జిల్లా ప్రగతిని వివరించారు.

  • అనకాపల్లి జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం మైదానంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని అనిత అన్నారు. అనకాపల్లి కేవలం జిల్లా కాదు.. పోరాటాల గడ్డగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి.. గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం అనకాపల్లి గడ్డ ప్రత్యేకత అని అనిత పేర్కొన్నారు.


  • నంద్యాల జిల్లాలోని పి.ఎస్.సి & కె.వి.ఎస్.సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • కర్నూలు: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి పరేడ్‌ను వీక్షించి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ డా.ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు హాజరయ్యారు.


  • ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొని..జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు.

  • శ్రీకాకుళం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సుపరిపాలనతో రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. గడిచిన రెండేళ్లలో రూ.1.49 లక్షల కోట్లను ఖర్చు చేశామని, జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశామని మంత్రి పేర్కొన్నారు.

  • విశాఖపట్నం: పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతా మాధురి, మణికంఠ, స్థానిక ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ ఆయిల్స్ అండ్ సీడ్స్ గ్రోవర్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


  • పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వేడుకల్లో పాల్గొన్నారు.

  • బాపట్ల జిల్లా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొని.. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

  • నెల్లూరు జిల్లాలోని పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంత్రి నారాయణ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఆపై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనను నారాయణ వివరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 12:17 PM