ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 23 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:51 PM
ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు- 2026కు సర్వం సిద్ధమైంది. నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు కలిపి మొత్తం 23 యూఎల్బీలకు పోలింగ్ జరుగనుంది.
విజయవాడ, నవంబర్ 25: ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు- 2026కు సర్వం సిద్ధమైంది. నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు కలిపి మొత్తం 23 యూఎల్బీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. 4 మేయర్ స్థానాలు, 19 ఛైర్పర్సన్ స్థానాలు కలిపి మొత్తం 23 పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఏదీ ఏకగ్రీవం కాకపోవడంతో అన్ని స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
4 మేయర్ పదవుల కోసం 36 మంది, 19 ఛైర్పర్సన్ పదవుల కోసం 134 మంది కలిపి మొత్తం 170 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,010 వార్డు సభ్యుల స్థానాల్లో 41 వార్డులు ఏకగ్రీవం అవగా.. మరో 5 వార్డుల్లో పోటీ లేకపోవడంతో 964 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. 4 కార్పొరేషన్లలో 2 వార్డులు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మేయర్/ఛైర్పర్సన్ ఎన్నికల కోసం 1,009 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కార్పొరేషన్ వార్డుల్లో 911 మంది, మున్సిపల్ వార్డుల్లో 2,057 మంది కలిపి మొత్తం 2,968 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో నిలిచారు.
23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 24,98,312 మంది ఓటర్లు కాగా.. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 12,04,819 మంది పురుష ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లు 12,93,084 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 409 మంది ఉన్నారు. మొత్తం 2,801 పోలింగ్ కేంద్రాలను నోటిఫై చేయగా.. ఏకగ్రీవ వార్డులను మినహాయించగా 2,698 కేంద్రాల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు. 819 సమస్యాత్మక , 597 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించి.. ఆ ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఒక్కో కేంద్రానికి రెండు చొప్పున 5,602 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద అదనంగా మరో 183 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
అలాగే 3,362 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,531 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 12,831 మంది ఇతర సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 302 మంది రిటర్నింగ్/ఎన్నికల అధికారులు, 378 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 142 మంది జోనల్ అధికారులు, 351 మంది రూట్ అధికారులను నియమించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం 23 కేంద్రాలు, 115 కౌంటింగ్ హాళ్లు, 842 టేబుళ్లను సిద్ధం చేశారు. లెక్కింపు ప్రక్రియకు 842 మంది సూపర్వైజర్లు, 2,526 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు.
నిర్భయంగా ఓటేయండి: ఎస్ఈసీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితమైన అమలుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎలాంటి ప్రలోభాలు, భయాలకు లోనుకాకుండా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ పిలుపు నిచ్చారు.
ఇవి కూడా చదవండి...
పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సీరియస్
ఏపీ సొంత ఆదాయంలో భారీ వృద్ధి.. రూ.74,342 కోట్లకు చేరిక
Read Latest AP News And Telugu News