ఏపీ సొంత ఆదాయంలో భారీ వృద్ధి.. రూ.74,342 కోట్లకు చేరిక
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:40 PM
ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.74,342 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 18.7 శాతం వృద్ధి నమోదైంది.
అమరావతి, నవంబర్ 25: రాష్ట్ర సొంత ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.74,342 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 18.7 శాతం వృద్ధి నమోదైంది. ఈరోజు (బుధవారం) ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా లీకేజీలు తగ్గడం, వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దడంలో ఆయా శాఖల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఆదాయంలో ప్రతిఫలించాలని సూచించారు. పన్నుల భారం లేకుండా, కొత్తగా ఛార్జీలు పెంచకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. పలు శాఖల్లో పారదర్శకత, ఆన్‌లైన్ విధానం, సంస్కరణల కారణంగా ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల కనిపించిందని చెప్పారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్లకు ఏఐ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలోని నాలుగు విభాగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఏఐ స్టాక్ వినియోగించామన్నారు. పన్ను రిటర్న్‌ల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, న్యాయ వ్యవహారాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే 18.7 శాతం వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్పెషల్ మార్జిన్‌తో కలిపి ఏపీ సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.11,738 కోట్లు అదనంగా ఆదాయ ఆర్జన జరిగింది. మొత్తంగా 18.7% వృద్ధి సాధించింది. స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం గత ఏడాది ఇదే సమయానికి రూ.62,604 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఏడాదిలో రూ.74,342 కోట్లకు రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది.
రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో నవంబర్ 23 నాటికే 58 శాతం సాధించినట్లు అధికారులు వివరించారు. రూ.10,104 కోట్ల మేర పన్ను ఆదాయం పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది ఇదే కాలానికి పన్ను ఆదాయం రూ.53,692 కోట్లు నమోదు కాగా.. ఈ ఏడాది రూ.63,796 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 18.8 శాతం వృద్ధి సాధించగా.... పన్నేతర ఆదాయంలో 31.3% వృద్ధి నమోదైనట్లు తెలిపారు. అలాగే వాణిజ్య పన్నుల ఆదాయం18.3 శాతం వృద్ధితో రూ. 5,917 కోట్లకు పెరుగుదల నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జీఎస్టీ ఆదాయం 18.1 శాతం వృద్ధితో రూ.3,694 కోట్ల మేర పెరిగిందన్నారు. స్పెషల్ మార్జిన్‌తో కలిపి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.20,083 కోట్లకు చేరిందని చెప్పారు. 19.6 శాతం వృద్ధితో గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.3,287 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందని వెల్లడించారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 16.6 శాతం వృద్ధితో రూ.8,020 కోట్లకు చేరిందని అధికారులు చెప్పారు. అంతేకాకుండా.. వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లలో 17.3 శాతం పెరిగి రూ.3,649 కోట్లకు పన్నుల ఆదాయం చేరిందన్నారు. వీటితో పాటు గనులు, భూగర్భ శాఖ ఆదాయం 13.2 శాతం పెరిగి రూ. 2,086 కోట్లకు చేరగా.. అటవీ శాఖ ఆదాయం 22.3% పెరిగి రూ.22 కోట్లకు చేరినట్లు తెలిపారు. పన్నేతర ఆదాయం రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు పెరిగిందన్నారు. పంచాయతీల పన్ను ఆదాయం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు రూ.238 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 20 వరకు రూ.2,365 కోట్ల మేర పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను ఆదాయం పెరిగినట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, గనులు, రవాణా, పురపాలక, పంచాయితీరాజ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం: మంత్రి అచ్చెన్నాయుడు
పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సీరియస్
Read Latest AP News And Telugu News