ఏపీ పంచాయతీ ఫేజ్-3 ఎన్నికలు.. వార్డులకు 1.03 లక్షల నామినేషన్లు
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:13 AM
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఫేజ్-3 ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 4,244 గ్రామ పంచాయతీలకు గాను మూడు రోజుల్లో 26,945 సర్పంచ్ నామినేషన్లు, 1,03,600 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.
అమరావతి, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఫేజ్-III ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 4,244 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు రోజుల్లో మొత్తం 26,945 సర్పంచ్ నామినేషన్లు దాఖలవగా.. 1,03,600 వార్డు సభ్యులు నామినేషన్లు నమోదయ్యాయి. సర్పంచ్ నామినేషన్లలో మొదటి రోజు 4,929 నామినేషన్లు, రెండో రోజు 11,578 నామినేషన్లు, మూడో రోజు 10,438 నామినేషన్లు నమోదు అయ్యాయి. మొదటి, రెండు రోజుల కంటే మూడో రోజు అధికసంఖ్యలో నామినేషన్లు నమోదయ్యాయి.
అలాగే వార్డుల సభ్యుల నామినేషన్లలోనూ తొలి రోజు కంటే.. రెండు, మూడో రోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 13,611 నామినేషన్లు దాఖలవగా.. రెండో రోజు 43,151 నామినేషన్లు, మూడో రోజు 46,838 నామినేషన్లు వచ్చాయి. ఫేజ్-III ఎన్నికల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్పంచ్ నామినేషన్లలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 1,758 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 1,686, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,565, మార్కాపురం జిల్లాలో 1,494, చిత్తూరులో 1,429 నామినేషన్లు నమోదు అయ్యాయి. అలాగే వార్డు నామినేషన్లలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముందు వరుసలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 7,706 నామినేషన్లు వచ్చాయి. ఆపై విజయనగరం జిల్లాలో 7,293, అనకాపల్లిలో 6,550, శ్రీకాకుళంలో 6,436, కాకినాడలో 5,182 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇవి కూడా చదవండి...
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఏపీలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Read Latest AP News And Telugu News