Share News

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

ABN , Publish Date - Jul 25 , 2026 | 10:47 AM

రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జ‌లాల‌ను గోదావ‌రి డెల్టా ఖ‌రీఫ్ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నామని అన్నారు.

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన
Nimmala Ramanaidu

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈరోజు(శనివారం) గోదావ‌రి, కృష్ణా డెల్టాల‌ ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈల‌తో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జ‌లాల‌ను గోదావ‌రి డెల్టా ఖ‌రీఫ్ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నామని ఈ సందర్భంగా నిమ్మల తెలిపారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవ‌స‌రాల‌కు, ఆరుత‌డి పంట‌ల‌కే వినియోగించాలని సూచించారు.


పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా తూర్పుగోదావ‌రి, కాకినాడ, విశాఖ‌ జిల్లాల్లో సుమారు 55 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని మంత్రి తెలిపారు. గోదావ‌రి డెల్టా ఆయ‌క‌ట్టు రైతులు సాగు కొన‌సాగించేందుకు, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. డెల్టాలో మెర‌క ప్రాంత రైతులు ఆరుతుడి పంట‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించి ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


గోదావ‌రి సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ డెల్టాల‌ ప్రాధాన కాలువ‌ల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఖ‌రీఫ్ పంట పూర్తయ్యే వ‌ర‌కు ఓఅండ్ఎం ప‌నులను కొన‌సాగిస్తూ.. రైతులు, సాగునీటి సంఘాల స‌హ‌కారంతో ఆయ‌క‌ట్టుకు సాగునీటిని అందించాలన్నారు. పోల‌వ‌రం కుడి ప్రధాన కాలువ ద్వారా వ‌చ్చే నీటిని దుర్వినియోగం కాకుండా, కృష్ణా డెల్టాకు అందేలా అధికారులు చర్యలు చేప‌ట్టాలని ఆదేశించారు. గోదావ‌రి, కృష్ణా డెల్టాల్లోని 10 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేష‌న్ అడ్వైజ‌రీ బోర్డ్ మీటింగ్‌లు నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు. ఎల్‌నినో క్లిష్ట స‌మ‌యంలో ఇరిగేష‌న్ శాఖలో పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంద‌రూ అందుబాటులో ఉండేలా సెల‌వులు ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


కృష్ణా డెల్టా ప‌రిధిలో నాగార్జున సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌కు నీళ్లు నిండకుండా, వ‌రిసాగు చేస్తే భవిష్యత్తులో పంట మొత్తం నష్టపోతుందని నిమ్మల తెలిపారు. పట్టిసీమ నుంచి వ‌చ్చే నీటిని కేవ‌లం తాగు నీటి అవ‌స‌రాల‌కు, ఆరుత‌డి పంట‌ల‌కు మాత్రమే వినియోగించాలన్నారు. నాగార్జున సాగర్‌కు ఈ సీజన్‌లో నీళ్లు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీళ్లను తాగు నీటికే భద్రపరచుకోవాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు సూచనలు చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో ఇరిగేష‌న్ స‌ల‌హాదారు వెంక‌టేశ్వరరావు, ఈఎన్సీ న‌ర‌సింహ‌మూర్తి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

పుష్పక విమానం కాదు నాయనా..!

హోం మంత్రి అనిత ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 10:58 AM