టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన.. ఉగాది నాటికి
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:15 PM
ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందని మంత్రి తెలిపారు.
అమరావతి, మార్చి 5: ఏపీలోని నగరాలు, పట్టణాల్లో జనాభా ప్రస్తుతం 36 శాతం ఉండగా, 2047 నాటికి 60 శాతానికి చేరుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. దీనికి తగినట్లుగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించామని చెప్పారు. గురువారం ఏపీ శాసనసభలో పురపాలకశాఖ బడ్జెట్ రూ.14,538కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెత్త సేకరణ, నిర్వహణ, నీటి పునర్వినియోగం, ప్రతి ఒక్కరికీ ఇళ్లు, రోడ్లు, ఆసుపత్రులు, శ్మశానాలు వంటి అంశాలపై దృష్టి సారించామని మంత్రి వివరించారు.
ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో 2100 ఎంఎల్‌డీ తాగునీరు సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డంపింగ్ యార్డుల్లోని చెత్తను పూర్తిగా క్లియర్ చేస్తున్నామని.. జూన్ నాటికి అన్ని డంపింగ్ యార్డులు శుభ్రంగా తయారవుతాయని వెల్లడించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందన్నారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చేసిందని విమర్శించారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం రూ.4,451 కోట్లు హడ్కో రుణం మంజూరైందని.. ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు.
పరిశుభ్రమైన వాతావరణంలో 205 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 3.07 కోట్ల మంది అల్పాహారం, 3.64 కోట్ల మంది భోజనం, 1.59 కోట్ల మంది రాత్రి భోజనం తీసుకున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరో 75 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేశామన్నారు. వివిధ శాఖల ఎన్‌ఓసీలను సింగిల్ విండో విధానంలో మంజూరు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని.. తణుకులో రూ. 691 కోట్లు, తిరుపతిలో రూ.147 కోట్లు కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. విజిలెన్స్ విచారణ తర్వాత సమస్య పరిష్కారమవుతుందని మంత్రి తెలిపారు.
రాజధాని అమరావతిని వైసీపీ మూడుముక్కలాటతో నాశనం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ల పాత బిల్లులు క్లియర్ చేశామని, మళ్లీ కొత్త టెండర్లు పిలిచి పనులు అప్పగించామని తెలిపారు. వర్షాలు ముగిసిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్నాయని.. రాబోయే మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు ఈ నెలలో పూర్తవుతాయని అన్నారు. మిగతా అధికారుల భవనాలు రెండు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.
మున్సిపాలిటీలకు పన్నుల రూపంలో వచ్చిన రూ. 3,500 కోట్లను వైసీపీ దారి మళ్లించిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను డబ్బులను సంబంధిత మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేసుకునేందుకు అనుమతించామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆపై మున్సిపల్ బడ్జెట్ గ్రాంట్లను శాసనసభ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి...
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్
Read Latest AP News And Telugu News