తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Apr 07 , 2026 | 01:45 PM
రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు.. మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.
అమరావతి, ఏప్రిల్ 7: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్‍పై(ABN Andhrajyothy) వైసీపీ దాడిని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఖండించారు. రాజధాని విషయంలో జగన్ రెడ్డి వైఖరిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ రాక్షస సంస్కృతికి ఈ దాడి నిదర్శనమని చెప్పుకొచ్చారు. సొంత మీడియాలో ఎవరిపై ఎలాంటి ఆరోపణలైనా చేస్తూ.. వారి వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులా అని నిలదీశారు.
ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని మంత్రి ఆరోపించారు. జగన్ పాలనలో జీవో 2430 ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదు అంటూ మూర్ఖంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏకంగా ప్రశ్నించే వారిపై దాడులు అత్యంత సిగ్గు చేటని మండిపడ్డారు. జగన్ రెడ్డి మూర్ఖత్వాన్ని, రాక్షస ప్రవృత్తిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
లోపాలను ఎత్తి చూపితే అంత ఉలుకెందుకో: ఎమ్మెల్యే సోమిరెడ్డి
వైసీపీలో లోపాలని ఎత్తి చూపితే అంత ఉలుకెందుకో అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘రాజధాని విషయంలో జగన్ ఏం చెబితే దానికి ఎస్ అనేందుకు వైసీపీ నేతలు సిద్ధపడ్డారు’ అని మాత్రమే ఏబీఎన్ సంస్థల ఎండీ రాధాకృష్ణ అన్నారని చెప్పారు. ‘మొదటేమో అమరావతి అంటే జైకొట్టారు.. ఆ తర్వాత మూడు రాజధానులంటే ఆహా... ఓహో... అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటే జేజేలు పలుకుతున్నారు’ అంటూ విమర్శించారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యానంలో తప్పేముందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అభ్యంతరం ఉంటే ఖండన ఇచ్చుకోండి... అంతే కానీ దాడులకు తెగబడుతారా. వైసీపీ నేతల తీరు చాలా అభ్యంతకరంగా ఉంది. పద్ధతి మార్చుకోవాలి’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.
దాన్ని అడ్డుకోవడం జగన్ తరం కాదు: ప్రత్తిపాటి పుల్లారావు
భౌతిక దాడులతో మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం జగన్ తరం కాదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు.. రాధాకృష్ణ రాతలు నిప్పు కణికలు అని చెప్పుకొచ్చారు. మావిగన్ ప్రతిపాదన వైసీపీలో ముసలం పుట్టించిందన్నారు. తన పిచ్చి ఆలోచనను వ్యతిరేకించిన సొంత పార్టీ నేతల్ని కట్టడిచేయలేక, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులను జగన్ ప్రోత్సహిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.
దాడులే అవసరం లేదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
వైసీపీ... మావిగన్ నష్టాన్ని మాఫీ చేసుకునేందుకే పత్రిక, మీడియా కార్యాలయాలపై ప్రత్యక్ష దాడులకి తెగపడుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. పత్రికలు, మీడియాల్లో వార్తలు వస్తే, ఇబ్బందులని వ్యక్తపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. దాడులే అవసరం లేదన్నారు. సాక్షి పత్రిక, టీవీల్లో వచ్చే వార్తలకి... ప్రతి రోజూ ఆ కార్యాలయాలపై దాడులు చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
బెదిరించి నిజాలను ఆపలేరు: వెంకట సుబ్బారావు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడికి యత్నించడాన్ని శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. రాజధాని అంశంపై ప్రశ్నించినందుకే మీడియాపై దాడి దుర్మార్గమని మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. రౌడీ మూకలతో మీడియా కార్యాలయాలపైకి వెళ్లడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. భయపెట్టే రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని.. మీడియాను బెదిరించి నిజాలను ఆపలేరని వెంకట సుబ్బారావు స్పష్టం చేశారు.
ఆ పత్రికకు విలువలు ఉన్నాయా: సయ్యద్ రఫీ
ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై జగన్ రెడ్డి చేస్తున్న దాడులను టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఖండించారు. మావిగన్‌పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవటానికి ఈ డైవర్షన్ డ్రామా నడుపుతున్నారని ఆరోపించారు. సాక్షి పత్రికకు విలువలు ఉన్నాయా అని సయ్యద్ రఫీ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రుల సమ్మె విరమణ
జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్
Read Latest AP News And Telugu News