జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:06 AM
ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే.. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని జగన్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.
విజయవాడ, ఏప్రిల్ 7: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడిందని ఎంపీ కేశినేని శివనాథ్(MP Kesineni Sivanath) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని.. ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించి, రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా 30 వేల ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడిపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు.
2019 ఎన్నికల్లో ‘ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, అమరావతిని అభివృద్ధి చేస్తా’ అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే.. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. 2019-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగ ఫలమే నేటి అమరావతి అని ఎంపీ అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చేలా ఎంతో తపన పడ్డారన్నారు. హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందాలని భావించారన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు.. భవిష్యత్తుతరాలకు మేలు చేసేలా నిర్ణయించారని తెలిపారు. రాజధాని బిల్లుకు చట్టబద్ధత రాదని చాలామంది భావించారని.. కొంతమంది అమరావతిపై జాతీయ స్థాయిలో విషం చిమ్మారని మండిపడ్డారు. మోదీ - అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు.
వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయన్నారు ఎంపీ. వైసీపీ మాత్రం లోక్‌సభ, రాజ్యసభలో బాయ్‌కాట్ చేసిందని అని అన్నారు. ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్ ప్రెస్‌మీట్ పెట్టి వ్యతిరేకించారని తెలిపారు. రాజధాని అమరావతితో తెలుగు ప్రజలందరకీ ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. 30 వేల ఎకరాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నిస్తోందని.. భవిష్యత్తుతరాల కోసం భూసమీకరణ చేస్తే తప్పేంటని కేశినేని శివనాథ్ నిలదీశారు. జగన్ మొదటి నుంచీ అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారని.. ఇప్పుడు ‘మావిగన్’ అని కొత్త డ్రామా మొదలుపెట్టారని ఎంపీ విమర్శించారు. ఇందులో అమరావతి అనేది ఎక్కడ ఉందో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
సీఆర్‌డీఏ పరిధి మొత్తం అమరావతి రాజధాని ప్రాంతమేనని ఎంపీ స్పష్టం చేశారు. ‘మూడు రాజధానులు అనబట్టే.. జగన్ రెడ్టి లెవన్ రెడ్డి అయ్యారు. ఇప్పుడు మావిగన్ అంటే.. ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారు. వైసీపీ నేతలే మా వద్దకు వచ్చి జగన్ వ్యాఖ్యలపై బాధ పడుతున్నారు. మావిగన్ మాటలతో జగన్ కామెడీ పీస్‌గా మారారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కమిట్‌మెంట్ చూపించామని... మరో 30 ఏళ్లు ఇదే ప్రభుత్వం ఉంటుందని అన్నారు. జగన్ రెడ్డి జీరో రెడ్డిగా మిగలబోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. చట్టాలు ఇష్టం వచ్చినట్లు మార్చడం సాధ్యం కాదని కూడా వాళ్లకు తెలియదన్నారు. అమరావతి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రుల సమ్మె విరమణ
Read Latest AP News And Telugu News