Share News

మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:25 PM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యంతో పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 4: పెనమలూరు ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra), ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడి టీచర్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో లావు బియ్యంతో భోజనం వడ్డించేవారని, ప్రస్తుతం సన్న బియ్యంతో మంచి భోజనం పెడుతున్నారని మంత్రికి విద్యార్థులు చెప్పారు. ఆ తర్వాత విద్యార్థులకు మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.


ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు చాలా సంతృప్తిగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్న బియ్యంతో పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఆకుకూరలు, పప్పు కూరలు ఏ రోజు ఏమి వడ్డించాలో ఓ షెడ్యూల్ ప్రకారం భోజనం అందిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు భోజనంతో పాటు ఒక గుడ్డు కూడా విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం, రేషన్ బియ్యంతో భోజనం పెట్టి విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకున్నారని విమర్శించారు.


డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ఎజెండాగా భోజనాలు పెడుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో సుమారు 2500 పాఠశాలలకు మోడల్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ పథకానికి మాత్రమే 2162 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్యూరిఫైడ్ మంచినీరు కూడా అందిస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేశ్ మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని కుట్రలు చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించి విద్యార్థుల స్థితిగతులను తల్లిదండ్రులకు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో మెగా డీఎస్సీతో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేశామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


విద్యార్థుల సంఖ్య పెరిగింది: ఎమ్మెల్యే

విద్యాశాఖపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. గతంతో పోలిస్తే మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య 100 శాతం పెరిగిందని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విద్యార్థులతో భోజనం చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నెలలో ఒక్కసారైనా ప్రజా ప్రతినిధులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి

రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2026 | 04:44 PM