ఎన్నికల వేళ.. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఐజీ రాజకుమారి
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:54 PM
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ, మలి దశ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఐజీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్) బి. రాజకుమారి తెలిపారు.
విజయవాడ, నవంబర్ 25: రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ, మలి దశ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఐజీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్) బి. రాజకుమారి తెలిపారు. బుధవారం విజయవాడలో ఐజీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ రాజకుమారి వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 607 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని.. 213 మంది అరెస్ట్ చేశామని.. 1,785 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 126/129 కింద 25,207 బైండోవర్ కేసులు నమోదు చేయడంతోపాటు 1,41,687 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37,942 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశామని అన్నారు.
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 9,337 ఆయుధాలు డిపాజిట్ చేశామని ఐజీ రాజకుమారి తెలిపారు. అలాగే 3,548.4 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు ఐజీ బి. రాజకుమారి స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఐజీ రాజకుమారి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్
నగరంలో మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమం: సీఎంసీ కమిషనర్ సృజన