నగరంలో మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమం: సీఎంసీ కమిషనర్ సృజన
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:48 PM
సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజారవాణాపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ (సీఎంసీ) జి. సృజన వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 25: సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజారవాణాపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ.. నగరంలో మూడు రోజుల పాటు సైబరాబాద్ మూవ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. నవంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు టీ హబ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్‌లో ప్రైవేట్ వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌తోపాటు వాయు కాలుష్యాన్ని తగ్గించి సురక్షితమైన ప్రయాణాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాయు కాలుష్యంపై ఈ కార్యక్రమంలో ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, రవాణా మార్గాలపై భారీ మ్యాపులు, డేటా విజువలైజేషన్ల ప్రదర్శన ఉంటుందని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాలు, నిత్యం ప్రయాణించే మార్గాలను మ్యాపుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా రవాణా సౌకర్యాలు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, కనెక్టివిటీపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించబోతున్నామని అన్నారు.
మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానంపై చర్చలు ఈ కార్యక్రమంలో ఉంటాయని సీఎంసీ కమిషనర్ సృజన చెప్పారు. ఐటీ, ఫార్మా కంపెనీల ఉద్యోగుల ప్రయాణ విధానాల్లో మార్పులపై ప్రత్యేక చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల కోసం టెక్నాలజీ ఆధారిత కార్పొరేట్ కమ్యూట్ విధానాలపై సీఈవోలతో చర్చలు ఉంటాయని వివరించారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు, పట్టణాభివృద్ధి నిపుణులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారని అన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థలు, పౌర సంఘాలు, సామాన్య ప్రజలకు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా అభివృద్ధిపై లీడర్‌షిప్ డైలాగ్స్, నాలెడ్జ్ సెషన్లు నిర్వహిస్తామని సీఎంసీ కమిషనర్ సృజన చెప్పారు. నగర రవాణా సమస్యల పరిష్కారానికి విద్యార్థులు, ప్రజల సలహాలు సూచనలు ఇవ్వవచ్చని.. వినూత్నమైన ఆలోచనలు కూడా పంచుకోవచ్చని సూచించారు. ఎంపికైన వినూత్న ఆలోచనలకు ప్రదర్శనలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని వివరించారు. భవిష్యత్ సైబరాబాద్‌ను సురక్షితమైన, కాలుష్య రహిత, మెరుగైన రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చలు జరుగుతాయని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్
స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్
Read Latest Telangana News And Telugu News