ఏపీలో స్థానిక ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్లు: ఎస్ఈసీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:48 PM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.
విజయవాడ, అక్టోబర్15: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. గురువారం ఎస్ఈసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వారికి స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుసరించే విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ ప్రతినిధులు ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని పరిశీలకులకు వివరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
మరో వైపు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్ధల ఎన్నికల్లో గుర్తులతో బ్యాలెట్ పేపర్లో అభ్యర్ధులకు చోటు కేటాయింపు విధివిధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో మేయర్లు, చైర్మన్లు, వార్డు సభ్యుల ఎన్నిక కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఈ విధివిధానాలు పాటిస్తారని ఎస్ఈసీ వెల్లడించింది. బ్యాలెట్ పత్రంలో మొత్తం ఐదు టేబుళ్ల కింద వరుస క్రమంలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల పార్టీ, గుర్తులు ప్రచురిస్తామని పేర్కొంది.
అంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం ప్రకారం రాజకీయ పక్షాలు, గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసింది.
మొదటి టేబుల్లో..
వరుస క్రమంలో ఐదు జాతీయ పార్టీలు. ఆమ్ ఆద్మీపార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. తర్వాత క్రమంలో మూడు రాష్ట్ర పార్టీలు జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉంటారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన 12 పార్టీల అభ్యర్థులకు చోటు ఉంటుందని వివరించింది.
రెండో టేబుల్లో..
ప్రత్యేక గుర్తుతో రిజిస్టర్ అయిన పార్టీలు లేవని స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
మూడో టేబుల్లో..
ప్రత్యేక గుర్తు లేకుండా ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు 99 ఉన్నాయి.
నాలుగో టేబుల్లో..
స్వతంత్రులకు 60 రకాల గుర్తులను గుర్తించినట్లు ప్రకటించిన ఎస్ఈసీ.
ఐదో టేబుల్లో..
వీటితో పాటుగా నోటా కూడ ఉంటుందని వెల్లడించిన ఎస్ఈసీ.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు: దుర్గ గుడి ఈవో
కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు
విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్
Read Latest AP News And Telugu News