Share News

ఏపీ లిక్కర్ రవాణా స్కాం.. పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు కారుమూరి

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:48 PM

ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు పీటీ వారెంట్‌‌పై విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు.

ఏపీ లిక్కర్ రవాణా స్కాం.. పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు కారుమూరి
AP liquor scam

విజయవాడ, సెప్టెంబర్ 17: ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. పీటీ వారెంట్‌పై మాజీ మంత్రిని చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలించారు. దీంతో కారుమూరి రిమాండ్‌ను కోర్టు ఈనెల 25 వరకు పొడిగించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(APSBCL) ద్వారా జరిగిన మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, మనీలాండరింగ్ జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం కిలోమీటర్‌కు రూ.13 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే టెండర్ల నిబంధనలను మార్చి కిలోమీటర్‌కు రూ.35 వరకు చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ నివేదిక సిద్ధం చేసింది.


కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాన్ని ఉపయోగించి కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములకు మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులు దక్కేలా చేశారని నిర్ధారించింది. ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ సహా ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, డిజిటల్ నెట్‌వర్క్స్ అధినేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో దాదాపు రూ.15 కోట్ల మేర హవాలా మార్గంలో కారుమూరికి చేరాయని, ఈ వ్యవహారంలో కీలక నిందితుల నుంచి లబ్ధిపొందినట్లు ఈడీ గుర్తించింది. దీంతో కారుమూరిని అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఆయన కుటుంబానికి సంబంధించిన సుమారు రూ.87.7 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.


ఇవి కూడా చదవండి..

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 03:17 PM