10 సెకన్లలోనే మండలిని వాయిదా వేసిన ఛైర్మన్
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:58 PM
ఏపీ శాసనమండలి వచ్చే బుధవారానికి (మార్చి 4) వాయిదా పడింది. ఈరోజు ఉదయం ఒకసారి సభ వాయిదా పడగా.. తిరిగి మొదలైనప్పటికీ పది సెకన్లకే ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
అమరావతి, ఫిబ్రవరి 27: వాయిదా అనంతరం తిరిగి మొదలైన ఏపీ శాసనమండలి కేవలం పది సెకన్లలోనే మరోసారి వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ మొదలైన వెంటనే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. అలాగే, తిరుమల లడ్డూ ప్రసాదంపై నిన్న జరిగిన లఘు చర్చలో తప్పుడు పత్రం ఇచ్చారంటూ ఛైర్మన్ ప్రకటన చేశారు.
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. ఛైర్మన్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. నెయ్యి అంశంపై ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో వైసీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
కొద్దిసేపటి తర్వాత శాసనమండలి తిరిగి మొదలైంది. మండలి ప్రారంభమవుతుందని సిబ్బంది బెల్ కొట్టగానే చైర్మన్ వచ్చి.. సభను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి, నమస్కారం చెప్పి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని నిరసన తెలిపారు. మండలిలోకి వెళ్లి తమ స్థానాల్లో కూర్చున్న మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు.. తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటికే రూల్ 307 కింద తిరుమల లడ్డూపై స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నోటీసు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే
బొత్సకు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
Read Latest AP News And Telugu News