Share News

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:06 PM

తిరుమల ప్రసాదం కల్తీపై శాసనమండలిలో 20 పేజీల సమగ్ర ప్రకటనను సర్కార్ సభ్యులందరికీ పంపిణీ చేసింది. ప్రకటనలో కల్తీపై వివరాలను స్పష్టంగా వెల్లడించింది.

శాసనమండలి.. లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో సర్కార్ ప్రకటన పంపిణీ
AP Legislative Council

అమరావతి, మార్చి 4: తిరుమల ప్రసాదం కల్తీపై శాసనమండలిలో ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసింది సర్కార్. సభ్యులందరికీ 20 పేజీల సమగ్ర ప్రకటనను పంపిణీ చేసి.. కల్తీపై వివరాలను స్పష్టంగా వెల్లడించింది. ఈ ప్రకటనలో తిరుమల లడ్డూ చారిత్రక నేపథ్యం, ప్రామాణిక పదార్థాలు, పోటు-మిరాసీ వ్యవస్థ వంటి అంశాలను వివరించింది. 2014-19 మధ్య కాలంలో అమలైన టెండర్ నిబంధనలు, 2020లో ఆ నిబంధనల్లో చేసిన సడలింపులు, మారిన టెండర్ నివేదికల్లో వచ్చిన మార్పులు అన్నింటినీ స్పష్టంగా వివరించింది.


నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఈవో అనీల్ కుమార్ సింఘాల్ సిఫార్సుల మేరకు అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు నిబంధనల సడలింపును ఆమోదించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నెయ్యి కల్తీని గుర్తింపు, ల్యాబ్ నివేదికల వివరాలను ప్రకటనలో వివరించింది. ఈ ఆధారాల మేరకు తిరుమల ప్రసాదం కల్తీ జరిగిందని కేసు నమోదు చేసి, సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి వివరాలను ప్రకటనలో సవివరంగా పేర్కొంది.


2020లో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారులను బెదిరించి, అంగీకరించని వారిని తనిఖీల పేరుతో లొంగదీసి రూ.4.69 కోట్లు లంచంగా తీసుకున్నట్లు విచారణలో రుజువైందని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 36 మంది నిందితుల్లో బోలెబాబా ఉద్యోగులు ఆశిష్ రోహిలా, మహేష్ కుమార్ రోహిలా, బత్తుల సురేంద్ర నాథ్ నేరాన్ని అంగీకరించారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి తప్పుడు సలహాలు ఇచ్చి రూ.75 లక్షల ఆర్థిక లాభం పొందినట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ సిఫార్సులు, వ్యవస్థాగత సంస్కరణలపై ఇవ్వనున్న నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

‘భూమి ఇచ్చేందుకు సిద్ధం’.. పంచగ్రామాల సమస్యలపై మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 04:01 PM