Share News

ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:50 PM

ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 , ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు మండలి ఆమోదం తెలిపింది.

ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం
AP Legislative Council

అమరావతి, మార్చి 4: ఏపీ శాసనసభ ఆమోదించిన రెండు కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 , ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు శాసనమండలిలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు. అసైన్డ్ భూముల చట్ట సవరణకు శాసన మండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. గత గురువారం శాసనసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. ఈ చట్ట సవరణ ద్వారా అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా కేటాయించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.


ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు లీజు రేటు నిర్ణయించారని.. ప్రతి రెండేళ్లకు 5 శాతం వరకు లీజు మొత్తం పెంచే విధంగా సవరణ చేసినట్లు తెలిపారు. అసైనీ దారులకు ఈ లీజు ద్వారా నికరమైన ఆదాయం లభిస్తుందన్నారు. బంజరు భూములు, చౌడు భూములుగా ఉన్న అసైన్డ్ భూములకు స్థిరమైన ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు క్లీన్ ఎనర్జీ చాలా కీలకమని మంత్రి చెప్పారు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని చోట్ల అసైన్డ్ భూములు అవసరమవుతాయని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


అసైనీదారుల పూర్తి అనుమతితోనే లీజుకు తీసుకుంటామని వెల్లడించారు. ట్రై-పార్టీ అగ్రిమెంట్ ద్వారా వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ చట్ట సవరణతో రూ.10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


అలాగే, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు-2026కు కూడా శాసనమండలి ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలను 'స్వర్ణ గ్రామం', 'స్వర్ణ వార్డు'లుగా మార్చే సవరణకు ఆమోదం లభించింది.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

‘భూమి ఇచ్చేందుకు సిద్ధం’.. పంచగ్రామాల సమస్యలపై మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 01:19 PM