పీఎం, సీఎం ఆదేశాలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక ఫోకస్: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - May 16 , 2026 | 03:11 PM
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంధన పొదుపు మీద ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని, పగటిపూట మన ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను తయారుచేసుకుని వినియోగించుకోవాలని సీఎం చెప్పారన్నారు.
అమరావతి, మే 16: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంధన పొదుపు మీద ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని, పగటిపూట మన ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను తయారుచేసుకుని వినియోగించుకోవాలని సీఎం చెప్పారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలని చాలా పెద్ద ఎత్తున సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రధాని దేశవ్యాప్తంగా కోటి కనెక్షన్లు పెడితే.. ఒక్క ఏపీలోనే 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. ఇంధన పొదుపు అనేది చాలా ముఖ్యమైన అంశంగా ముఖ్యమంత్రి ముందుకువెళ్తున్నారని మంత్రి అన్నారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇలాంటి శిలాజ ఇంధనాలను భారతదేశం నిత్యం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఉందని మంత్రి తెలిపారు. సౌరశక్తి, గాలి ద్వారా ఇలా ప్రత్యమ్నాయ పద్ధతుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని సీఎం చెప్పారన్నారు. ప్రతి ఇంటిపై 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. అదనంగా ఇంకో రూ.20 వేలు కలిపి ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్లకు మొత్తం రూ.1.25 లక్షల సబ్సిడీని ప్రభుత్వమే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంధన పొదుపు చాలా ముఖ్యమన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి.. ప్రజలపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులు ఉన్నా ప్రభుత్వమే భరించిందని చెప్పుకొచ్చారు. గతంలో ఉన్న 5 వేల కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరించేలా సీఎం చొరవ చూపారన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి, ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రొటోకాల్ వాహనాలను తగ్గిస్తున్నామన్నారు.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సూచనలను అందరం ఆచరించాలని మంత్రి సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలన్నారు. గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ సుంకమంటూ ప్రజలపై విపరీతంగా భారం వేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మొదటగా 13 పైసలు తగ్గించిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ప్రజలపై భారం పడకుండా చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో సీఎం తీసుకువచ్చిన సంస్కరణల వల్ల 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలిగిన స్థాయికి వచ్చామన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు సలహాలు, సూచనల మేరకు క్లీన్ ఎనర్జీ ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం అవసరం: మంత్రి సవిత
ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ తప్పనిసరి: మంత్రి కొల్లురవీంద్ర
Read Latest AP News And Telugu News