ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ తప్పనిసరి: మంత్రి కొల్లురవీంద్ర
ABN , Publish Date - May 16 , 2026 | 01:06 PM
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని అధికారులకు మంత్రి కొల్లురవీంద్ర సూచించారు. గ్రామ వార్డు, సచివాలయాల వారీగా ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
కృష్ణా జిల్లా, మే 16: ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈరోజు(శనివారం) మచిలీపట్నం రైతు బజార్ ప్రాంగణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. గ్రామ వార్డు, సచివాలయాల వారీగా ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్ధాలను, ప్రజలకు జరిగే నష్టాలను వివరించాలని.. దీనిపై సమగ్ర అవగాహనతో ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ అవసరం: కొనకళ్ల నారాయణ
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ.. ఒక్కో బస్సు ధర సుమారు రూ.1.60 కోట్ల నుంచి రూ. 1.70 కోట్ల వరకు ఉందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి బస్సులను కొనుగోలు చేయడం ప్రస్తుతానికి ఆర్టీసీకి, ప్రభుత్వానికి సాధ్యం కాని పనిగా చెప్పుకొచ్చారు. దీనికి బదులుగా బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే.. వారే పెట్టుబడులు పెట్టి బస్సులను నడుపుతారన్నారు. దీనివల్ల ఆర్టీసీపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 10 వేల బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు. వాటన్నింటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలంటే దాదాపు రూ.15 వేల కోట్లు అవసరమని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిందన్నారు. ప్రయాణికులకు ఛార్జీలు పెంచే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చు చాలా తక్కువన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, నిర్వహణ వ్యయం తగ్గి.. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు. రాబోయే రెండు నెలల్లో ఈ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయని కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
డప్పు కళాకారుల ప్రదర్శన.. సరికొత్త చరిత్రకు నాంది: పీవీఎన్ మాధవ్
స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం అవసరం: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News