పాపులేషన్ మేనేజ్‌మెంట్ కొత్త పాలసీ.. శాసనసభలో సీఎం ప్రకటన
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:13 PM
భారత్‌తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఫెర్టిలిటీ రేట్ తగ్గే పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు సీఎం.
అమరావతి, మార్చి 5: ఏపీ శాసనసభలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని ఇవాళ శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు సీఎం. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీని శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజల ముందు ఉంచుతున్నామని వివరించారు. దీనిపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని సీఎం తెలిపారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ లాంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని.. భారత్‌తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఈ తరహా పరిస్థితే నెలకొందని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ (TFR) 1.5గా ఉందని.. 1993లో ఇది 3.0గా నమోదైందని సీఎం వివరించారు. టీఎఫ్‌ఆర్ వేగంగా తగ్గితే పని చేసే వయస్సులో ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గి, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 6.70 లక్షల జననాలు నమోదవుతున్నాయని తెలిపారు. ఇలాగే కొనసాగితే 2047 నాటికి జనాభాలో 23 శాతం మంది వృద్ధులు ఉంటారని అన్నారు. మహిళల లేబర్ ఫోర్సు పార్టిసిపేషన్ రేట్ ప్రస్తుతం 31 శాతంగానే ఉంటుందని.. ఇది 59 శాతానికి చేరితే రాష్ట్ర జీఎస్‌డీపీ 15 శాతం పెరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
పాపులేషన్ మేనేజ్‌మెంట్ కోసం ఐదు అంచెల లైఫ్ సైకిల్ విధానాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు సీఎం. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని లాంటివి ఐదు పిల్లర్లుగా పనిచేస్తాయన్నారు. మహిళల గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. పిల్లలు లేక ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడేవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని.. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి, సబ్సిడీపై పీపీపీ మోడల్‌లో ఐవీఎఫ్(IVF) సేవలు అందించాలని యోచిస్తున్నామని అన్నారు. సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించడం ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ప్రస్తుతం 8.8 శాతంగా ఉన్న టీనేజి గర్భధారణలను 3 శాతం కంటే తక్కువకు తగ్గించే చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
50 మంది చిన్నారులు ఉన్న చోట చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సీఎం తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మహిళా ఉద్యోగులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాల్లో కొత్త వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మూడో సంతానం, ఆపై జననాలకు తల్లులకు 12 నెలల పేరెంటల్ లీవ్, తండ్రులకు 2 నెలల పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నామని అన్నారు. త్వరలో 'తల్లిదండ్రుల సమాన బాధ్యత' పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తామని సీఎం తెలిపారు.
2047 నాటికి ఏపీలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా వేస్తూ, ప్రతి జిల్లాలో వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు సీఎం. 175 సీహెచ్‌సీలలో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తామని తెలిపారు. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ను మెంటరింగ్‌లో భాగం చేస్తామన్నారు. రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగులకు 15 రోజుల వెల్‌నెస్ లీవ్, రూ.50,000 ఆరోగ్య నిధి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్
టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన.. ఉగాది నాటికి
Read Latest AP News And Telugu News